మన్యంలో విలువైన ఖనిజ సంపదను దోచుకునే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఔట్ పోస్టులు
	{పభుత్వానికి మావోయిస్టు నేత  వేణు హెచ్చరిక
	మన్యంలో తక్షణం బాక్సైట్, ఔట్‌పోస్టుల పనులు ఆపాలి
పెదబయలు: మన్యంలో విలువైన ఖనిజ సంపదను దోచుకునే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఔట్ పోస్టులు యుద్ధప్రాతిపదికన నిర్మిస్తోందని మల్కన్‌గిరి- విశాఖ - కోరాపుట్టు బోర్డర్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి వేణు పేర్కొన్నారు. ఇప్పటికైనా మన్యంలో మాక్సైట్ తవ్వకాల ప్రయత్నాలు విరమించుకొని.. ఔట్ పోస్టుల నిర్మాణాలు ఆపకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం స్థానిక విలేకరులకు ఒక ప్రకటన పంపారు.
	
	నిర్బంధంలో మన్యం ప్రజలు
	పెదబయలు మండలం రూడకోట గ్రామంలో నిర్మిస్తున్న ఔట్ పోస్టు ప్రాంతంలో తీవ్రమైన నిర్బంధ పరిస్థితులను  ప్రజలు అనుభవిసున్నారని, తనిఖీ లు, మిలటరీ ఆంక్షల పేరుతో మానసికంగా  హింసిస్తున్నారని ఆరోపించారు.  ఇక్కడి ప్రజలకు భయపెట్టి వారితో నిర్మాణ పనులు చేయించుకుంటున్నారని, మహిళలు  తాగునీటి గెడ్డలకు వెళ్లాలన్నా, ఇంట్లో ఒంటరిగా ఉండాలన్న భీతిల్లిపోతున్నారని,  ఈ ప్రాంతాల్లో శుభ, ఆశుభ కార్యక్రమాలకు  బంధువులు  నిర్భయంగా రాలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. మన్యంలో  ఉన్న అపారమైన ఖనిజంపై  పాలకవర్గాల కన్ను పడటమే ఈ పరిస్థితికి కారణమన్నారు.  రెండేళ్లుగా  ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు పెద్దఎత్తున  బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పోలీసు బలగాలతో పాశవిక నిర్భందానికి, అణిచివేతకు పూనుకుంటోందన్నారు. ప్రజలు ఎక్కడైతే అవమానాలకు, అన్యాయానికి, అణిచివేతకు గురవుతారో  తప్పకుండా అక్కడ ప్రతిఘటన ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే ఈ  నెల 6న  ప్రజలతో కలిసి రూడకోట క్యాంపు నిర్మాణ  పనులకు రక్షణ కల్పిస్తున్న పీఆర్‌పీఎఫ్ పోలీసులపై పీఎస్‌జీఏ (పీపుల్స్ లెబలేషన్ గెరిల్లా  ఆర్మీ) దాడి చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు మారకుంటే ఇలాంటి దాడులు పునరావృతం కాకతప్పదని హెచ్చరించారు.
మన్యంలో పోలీసు క్యాంపు నిర్మాణాలకు ఎవరూ సహకారం అందించరాదని, మన్యం ప్రజల మనుగడ కోసం సాగిస్తున్న పోరాటానికి అన్ని వర్గాల వారు మద్దతు ఇవ్వాలని కోరారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
