జోరువాన.. తడిసిముద్దయిన అభ్యర్థులు..!!

army recruitment rally in vizianagaram stopped due to rain

సాక్షి, విజయనగరం: భారీ వర్షాలు పడుతుండటంతో విజయనగరం జిల్లా కేంద్రంలో తలపెట్టిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ శుక్రవారం రద్దు అయింది. శుక్రవారం నుంచి రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉండగా.. జోరువాన కారణంగా రద్దు చేశారు.  ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ పాల్గొనేందుకు గురువారం అర్ధరాత్రి నుంచే అభ్యర్థులు క్యూలైన్‌లో బారులు తీరారు. అయితే, అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో అభ్యర్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలిరోజే నరకం అనుభవించారు. గురువారం అర్ధరాత్రి నుంచి క్యూలైన్లో నిల్చున్న అభ్యర్థులు భారీ వర్షంలో తడిసి ముద్దయ్యారు. రోజుకు ఐదువేల మంది చొప్పున సుమారు 55 వేల మంది అభ్యర్ధులు ఆర్మీ రిక్రూట్ మెంట్ కు  హాజరు కానున్నారని అంచనా. పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతున్నా... కనీస వసతులు  కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని అభ్యర్ధులు ఆవేదన చెందారు. తమ సర్టిఫికేట్లు వానలో తడిసి పోతున్నా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు.

భారీగా వర్షాలు..
విజయనగరంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోటలో కుండపోతగా వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ కాలువలను తలపించాయి. ఇళ్లలోకి, షాపుల్లోకి వర్షం నీరు భారీగా చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఇంత భారీ వర్షాన్ని చూడలేదని స్థానికులు చెబుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top