ప్రతికూల పవనాలు..

Ap Mlc Elections Results - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ఫలితాలను సమీక్షిస్తే ఎమ్మెల్సీ ఓటర్లుగా వున్న పలు వర్గాల ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయ, అధ్యాపకులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా వున్నట్లు తేటతెల్లమవుతోంది. గాదె శ్రీనివాసులు నాయుడుకు ప్రధానంగా పీఆర్‌టీయూ.. మరో నాలుగు సంఘాలు మద్దతు ప్రకటించాయి. రఘువర్మకు యూటీఎఫ్‌తోపాటు, ఎస్‌టియు, ఏపీటీఎఫ్, ఎస్సీ, ఎస్టీ టీచర్స్‌ ఫెడరేషన్, జీసీజీటీఏ, ఏపీఎంఎస్‌టీఎఫ్, కేజీబీవీ, జీటీఏ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఎమ్మెల్సీగా వున్న గాదె శ్రీనివాసులునాయుడు ప్రభుత్వ నిర్ణయాలకు వత్తాసు పలుకుతూ వచ్చారని, కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పండిత వర్గాలకు వ్యతిరేకంగా వచ్చేటట్లు వ్యవహరించారన్న ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల నుంచి బహిరంగంగానే వినిపించాయి.

2004 తరువాత ఆయన తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పట్లో వైఎస్సార్‌ చలువతో ఉపాధ్యాయ వర్గాలకు ఆయన తీసుకున్న సానుకూల నిర్ణయాలు వలన గాదె గెలుపొందగలిగారు. రెండో దఫా కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరగగా, గాదె విజయం సాధించారు. వైఎస్సార్‌ తీసుకున్న నిర్ణయాలు 2012 వరకు కొనసాగడంతో గాదె విజయం సాధ్యమైంది. తెలుగుదేశం వచ్చిన తరువాత ఆ పార్టీలో చేరిన గాదె ఉపాధ్యాయులకు అనుకూలంగా దేనినీ సాధించలేకపోయారు. కనీసం సమస్యలపై పోరాట ధోరణిని కూడా ప్రదర్శించలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనివలనే ఆయన ఈసారి ఓటమి చెందారు. యూటీఎఫ్, ఎస్‌టీయూ, ఏపీటీఎఫ్‌ వంటి సంఘాలు తొలి నుంచి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ఉపాధ్యాయ సమస్యలపై పోరాటాలు చేస్తూ వచ్చాయి. దీంతో వీరు బలపరిచిన రఘువర్మ ఎమ్మెల్సీగా విజయం సాధించగలిగారు. 

కాంట్రాక్టు అధ్యాపకులకు అన్యాయం
కాంట్రాక్టు అధ్యాపకులకు సర్వీసు రెగ్యులరైజ్‌ చేస్తానని హామీ ఇచ్చి ప్రభుత్వం విస్మరించింది. అటు తరువాత టైమ్‌ స్కేల్‌ ఇస్తున్నట్లు ప్రకటించి దీనికి సంబంధించిన ఉత్తర్వుల్లో స్పష్ఠత లేకుండా చేయడంతో పాటు, ఎన్నికల తరువాత టైమ్‌ స్కేల్‌ అమలయ్యేటట్లు పేర్కొనడంతో ప్రభుత్వంపై నమ్మకం సడలిన అధ్యాపకులు ఎమ్మెల్సీ ఓటింగులో తమ నిరసనను వ్యక్తం చేశారు.  

ఉపాధ్యాయులకు ఎన్నో సమస్యలు
ఉపాధ్యాయులకు ఎన్నో సమస్యలు వున్నాయి. పీఆర్సీ, డీఏ బకాయిల విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరించడంతో ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వానికి తమ సత్తాను తెలియజేశారు. సీపీఎస్‌ రద్దు విషయంలో కూడా ప్రభుత్వం వ్యతిరేక విధానాన్ని అవలంబించడంతో ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో అసంతృప్తితో వున్నారు. 398 ఉపాధ్యాయులకు నోషనల్‌ ఇంక్రిమెంట్‌ విషయంలో కూడా సానుకూల నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల ముందు వీటన్నింటికి సంబంధించి సానుకూలంగా వున్నట్లు వ్యవహరించిన ప్రభుత్వం ఉత్తర్వుల్లో మాత్రం ఎన్నికల అనంతరం అమలయ్యేటట్టు పేర్కొనడంతో ప్రభుత్వాన్ని నమ్మని ఉపాధ్యాయులు ఓటును వ్యతిరేకంగా వేశారు. పండిట్, పీఈటీలను ఊరించి ఉసూరుమనిపించిన ప్రభుత్వం రాష్ట్రంలోని 12 వేలకు పైగా పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి వాటిని పదోన్నతులపై భర్తీ చేయకపోవడంతో ఆయా వర్గాల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఉత్తర్వులు వెలువరించడానికి రెండు నెలలకు పైగా పట్టింది.

అటు తరవాత పదోన్నతుల కోసం పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. మునిసిపల్‌ యాజమాన్యంలో పదోన్నతులు చేపట్టేలా ఉత్తర్వులు వెలురించిన ప్రభుత్వం, జిల్లా పరిషత్, ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో పదోన్నతులు చేపట్టకుండా కాలయాపన చేసింది. ఈ విషయంలో పండిట్లు, ఎస్జీటీల మధ్య వివాదం రేపి తాత్సారం చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే వరకు నాన్చుడు ధోరణి ప్రదర్శించింది. విద్యాధికులైన ఉపాధ్యాయులు ఓటు రూపంలో ప్రభుత్వంపై వున్న వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 

రెగ్యులరైజేషన్‌కు నోచుకోని కేజీబీవీ సిబ్బంది
కేజీబీవీల్లో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది రెగ్యులరైజేషన్‌కు నోచుకోలేకపోయారు సరికదా, ఉద్యోగ భద్రత లేకుండా అయిపోయారు. కాంట్రాక్టు పద్ధతిన వున్న కొందరిని ఏజెన్సీ పరిధిలోనికి తీసుకువచ్చి నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా చేశారు. మోడల్‌ స్కూళ్లలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. 

ఉమ్మడి సర్వీసు రూల్స్‌  సాధనలో గాదె విఫలం
ఉమ్మడి సర్వీసు రూల్స్‌ సాధించడంలో గాదె శ్రీనివాసులునాయుడు విఫలమయ్యా రు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాసులునాయుడు ఆధ్వర్యంలో కమిటీని ఢిల్లీ పంపించింది. అక్కడి నుంచి ఓ పనికి రాని జీఓను తీసుకువచ్చి నేరుగా తిరుమల వెళ్లి గుండు కొట్టించుకున్నారు. ఈ జీఓ వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. 
–పేడాడ ప్రభాకరరావు, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top