
విజయవాడలోని ఓ రెస్టారెంట్‌లో కస్టమర్లు భౌతిక దూరం పాటించేలా దూరదూరంగా టేబుళ్లు ఏర్పాటు చేసిన దృశ్యం
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ మినహాయింపుల్లో భాగంగా ఆతిథ్య రంగానికి చెందిన వ్యాపార సంస్థలు పాటించాల్సిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలు, ఇతర వసతులను నిర్వహించే సంస్థలు తాజా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హోటళ్లు ఏం చేయాలంటే..
► ప్రవేశ ద్వారాల వద్ద హ్యాండ్ శానిటైజర్లు ఉంచాలి. థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలి.
► మాస్కులు ధరించాలి. ఉమ్మి వేయడం నిషిద్ధం. సిబ్బంది, అతిథులు మొబైల్ ఫోన్లలో ‘ఆరోగ్య సేతు’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
► అతిథుల పూర్తి వివరాలను నమోదు చేయాలి. అంతర్జాతీయ అతిథుల కోసం ఏ అండ్ డీ రిజిస్టర్ నిర్వహించాలి.
► వీలైనంత వరకు డిజిటలైజేషన్ ప్రక్రియను పాటించాలి. అతిథుల బ్యాగేజీని డిస్‌ఇన్‌ఫెక్షన్ చేసిన తరువాతే గదుల్లోకి అనుతించాలి.
► చెక్ ఔట్ చేసిన వెంటనే ఆ గదులను శుభ్రం చేయాలి. లినెన్, టవళ్లు మార్చాలి.
► సిబ్బందిని బ్యాచ్‌లుగా విభజించి విడతల వారీగా విధులు కేటాయించాలి. సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, లాంగ్ గౌన్లు, కళ్లద్దాలు, ఫేస్ షీల్డ్ మొదలైనవి సమకూర్చాలి.
► డోర్ నాబులు, స్విచ్చులు, హ్యాండిళ్లు, కుళాయిలు మొదలైనవి తరచూ శానిటైజ్ చేయాలి.
► మేనేజ్‌మెంట్ ఉన్నత స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలి.
► అతిథులు, సిబ్బందికి కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఈ ర్యాపిడ్ రెస్సాన్స్ టీమ్‌లదే.
విశాఖ మద్దిలపాలెంలోని ఓ షాపింగ్‌మాల్‌లో కస్టమర్ల సందడి
అతిథులు పాటించాల్సినవి
► గది లోపల బట్టలు ఉతక్కూడదు. బాల్కనీలో నిలబడి పక్క గది బాల్కనీలో ఉన్న అతిథులతో సంభాషించకూడదు. గదుల్లోకి సందర్శకులకు అనుమతి లేదు.
► ఉపయోగించాక అన్ని డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, బాటిళ్లను గార్బేజ్ బ్యాగ్‌లో వేయాలి.
రెస్టారెంట్లు ఇవి పాటించాలి
► భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌లు వేయాలి. వీలైనంత వరకు టేక్ అవే లేదా పార్సిళ్లను ప్రోత్సహించాలి. 4 టేబుళ్లను దూరం దూరంగా ఏర్పాటు చేయాలి. సిబ్బందికి ప్రతిరోజూ థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. 4 సిబ్బంది అంతా మాస్కులు, గ్లౌజులు, ఫేస్ షీల్డ్ ధరించాలి. ఏసీల కోసం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలి.
► రెస్టారెంట్లకు వచ్చే అతిథులను థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే లోనికి అనుమతించాలి.
► డిస్పోజబుల్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, నాప్కిన్లు వాడాలి. బఫేట్ సేవలకు అనుమతి లేదు. 4 కిచెన్, అన్ని వంట వస్తువులు, ఫర్నిచర్ తరచూ డిస్‌ఇన్‌ఫెక్షన్ చేయాలి. 4 మాంసాహార పదార్థాలను శానిటైజ్ చేసేందుకు 100 పీపీఎం క్లోరిన్, శాఖాహార పదార్థాలను శానిటైజ్ చేసేందుకు 50 పీపీఎం క్లోరిన్‌ను వాడాలి. 4 హోం డెలివరీల కోసం ఉపయోగించే వాహనాలను తరచూ డిస్‌ఇన్‌ఫెక్షన్ చేయాలి. డ్రైవర్, ఇతర సిబ్బంది మాస్కులు, గ్లౌజులు ధరించాలి.