సర్వం స్వపక్షమే...

ap govt completed assembly sessions without opposition - Sakshi

ఏకపక్షంగా శీతాకాల అసెంబ్లీ సమావేశాలు

తొలిసారిగా ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభ

ఊకదంపుడు ఉపన్యాసాలు.. సీఎంను పొగుడుతూ స్తోత్రపాఠాలు

సరైన చర్చ లేకుండానే కీలక బిల్లులకు ఆమోదం

అసెంబ్లీ.. 67 గంటలు, శాసన మండలి.. 51 గంటలు

భూసేకరణ, నాలా సహా 16 బిల్లులకు ఆమోదం 

సాక్షి అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్షం లేకుండా జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు పూర్తి ఏకపక్షంగా జరిగాయి. 12 రోజులపాటు ఊకదంపుడు ఉపన్యాసాలతో హోరెత్తించిన అధికారపక్షం ఆత్మస్తుతి, పరనిందతో విసుగెత్తించింది. తమ పార్టీ నుంచి అధికారపార్టీలోకి ఫిరాయించిన వారిపై వేటు వేసేంత వరకు శాసనసభ సమావేశాలకు హాజరు కారాదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దీంతో ప్రతిపక్షం లేకుండానే ప్రభుత్వం ఈ సమావేశాలను నిర్వహించింది. ప్రతిపక్ష పార్టీ సభలో ఉన్నప్పుడు నాలుగైదు రోజులు సభ జరిపేందుక్కూడా ఇష్టపడని రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షం లేకపోవడంతో 12 రోజులపాటు సమావేశాల్నినిర్వహించడం గమనార్హం. పలు కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టి సరైన చర్చ లేకుండా.. కేవలం తన సభ్యుల భజనతోనే వాటిని ఆమోదింపజేసుకుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఊకదంపుడు ఉపన్యాసాల హోరు..
ఈ సమావేశాల్లో 16 బిల్లుల్ని ఆమోదించగా వాటిలో పదికిపైగా బిల్లుల్ని ఒకేరోజు ప్రవేశపెట్టి ఆమోదించడం విశేషం. ఎంతో ముఖ్యమైన నాలా బిల్లు, భూసేకరణ బిల్లును సాదాసీదాగా ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించేసింది. ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న కాపు రిజర్వేషన్ల బిల్లుపైనా తూతూమంత్రంగా చర్చ జరిపి ఆమోదించింది. ఈ అంశంపై రాష్ట్ర స్థాయిలో ఉద్యమం జరుగుతున్న స్థితిలో కనీస చర్చ లేకుండా సంబంధిత బిల్లును ఆమోదించడంపై మేధావులు ఆశ్చర్యం వెలిబుచ్చుతున్నారు. ఇంతటి కీలకమైన బిల్లును ప్రతిపక్షం లేని సమయం చూసి వ్యూహాత్మకంగా చివరిరోజు ప్రవేశపెట్టి, పూర్తిస్థాయి చర్చకు అవకాశం లేకుండా ఆమోదించడాన్ని బీసీ సంఘాలు తప్పుపడుతున్నాయి. ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషించామని, తమ ఎమ్మెల్యేలతోనే ప్రజా సమస్యలు లేవనెత్తించి చర్చించామని చెబుతున్నా.. అది చర్చ కాదు కేవలం భజనేనని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

ఏ అంశాన్ని తీసుకున్నా సభ్యులందరూ సీఎం చంద్రబాబును, ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తడం తప్ప సమస్యలను ఎత్తిచూపిన సందర్భాల్లేవు. ఒకే అంశంపై ఐదారుగురు ఎమ్మెల్యేల ఊకదంపుడు ఉపన్యాసాలు, దానిపై సంబంధిత మంత్రి సమాధానం, తర్వాత సీఎం ఉపన్యాసం ఇలా.. ప్రతిరోజూ రొటీన్‌గా సాగిపోయాయి. ఓ అంశంపై మంత్రి సుదీర్ఘంగా జవాబిచ్చాక కూడా సీఎం మళ్లీ గంటకుపైగా అదే అంశంపై ప్రసంగించడం అధికారపక్ష సభ్యులకు బోరు కొట్టించింది. ఇలా చెప్పిన విషయాల్నే మళ్లీమళ్లీ గంటల తరబడి చెప్పుకుని సమయాన్ని వృథా చేయడం తప్ప అర్థవంతమైన చర్చ ఎక్కడ జరిగిందని కొందరు టీడీపీ నేతలే ప్రశ్నిస్తుండడం గమనార్హం. ఈ ప్రసంగాలతో విసుగెత్తి చాలామంది అధికారపార్టీ సభ్యులు సభలోకి రాకపోవడం రివాజుగా మారింది. దీన్నిబట్టే సభ ఎంత సీరియస్‌గా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించిన నేపథ్యంలో వారిని సభకు తీసుకొచ్చేందుకు అధికారపక్షం ఎటువంటి ప్రయత్నం చేయలేదు సరికదా కనీసం ఆ ఆలోచన కూడా చేయకపోవడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు.

67 గంటలు.. : శీతాకాల అసెంబ్లీ సమావేశాలు 67 గంటల 48 నిమిషాలపాటు జరగ్గా, మండలి సమావేశాలు 51 గంటలపాటు జరిగాయి. అసెంబ్లీలో 94 ప్రధాన ప్రశ్నలకు మంత్రులు సమాధానమివ్వగా, 13 స్వల్ప నోటీసు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 74వ నిబంధన కింద ఏడు అంశాలపై, 344వ నిబంధన కింద ఎనిమిది అంశాలపై చర్చలు జరిగాయి. 16 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు తీర్మానాలకు ఆమోదం లభించింది. సభ్యులు 382 ప్రసంగాలు చేయగా, బీసీ సంక్షేమంపై ఒక నివేదికను ప్రవేశపెట్టారు. పదంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మండలిలో వంద ప్రధాన ప్రశ్నలకు మంత్రులు జవాబిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top