వివాదాలన్నీ కేంద్రానికి నివేదిద్దాం!


గవర్నర్ అధికారాలపై కేంద్రమిచ్చిన స్పష్టతతో ఏపీ సర్కారు హర్షం

ఇతర వివాదాలనూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం

ఆయా అంశాలపై గవర్నర్ స్పందించాలని కోరుతున్న మంత్రులు


సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతిభద్రతల విషయంలో గవర్నర్ అధికారాలపై కేంద్రం స్పష్టత ఇవ్వడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా ఉమ్మడి రాజధాని విషయంలో గవర్నర్‌కు అధికారాలు ఉండాల్సిందేనని ఏపీ ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో కేంద్రం స్పష్టత ఇవ్వడంతో ఇక పలు వివాదాస్పద అంశాలను గవర్నర్ దృష్టికి, ఆ తర్వాత కేంద్రం దృష్టికి తేవాలని నిర్ణయించింది. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా గవర్నర్ అధికారాలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం.. అదే చట్టంలో పొందుపరిచిన విద్య, నీటి సమస్యలను కూడా పరిష్కరించాలని కోరనుంది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల అంశంపై కేంద్ర హోంశాఖ పంపించిన సమాచారాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులు విశాఖపట్నం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరించారు. కేంద్ర నిర్ణయంపై ఈ సందర్భంగా సీఎం హర్షం ప్రకటించినట్టు అధికారులు చెప్పారు. ఇదే వరుసలో మిగతా వివాదాస్పద అంశాలపైన కూడా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరాలని నిర్ణయించారు. ఇంతకాలం గవర్నర్‌కు వినతిపత్రాలు అందజేస్తున్నప్పటికీ అధికారాలపై స్పష్టత లేక ఆయన కూడా సరిగా స్పందించే పరిస్థితి లేదని, అయితే ఇప్పుడు గవర్నర్ సైతం స్పందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

 గవర్నర్‌ను కలిసేందుకు మంత్రుల సన్నద్ధం

 ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం పేరు మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిన ఘటనపై ఏపీ మంత్రులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఇవి రెచ్చగొట్టే చర్యలని, ఇలాంటి పనులకు ఉపక్రమించినందుకు గవర్నర్ జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంటుందని, త్వరలోనే గవర్నర్‌ను కలిసి పలు అంశాలు వివరించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. తాజాగా ఎంసెట్ కౌన్సెలింగ్, స్థానికత, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి విషయాల్లో ఇప్పటికైనా గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం కోరుతోంది. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం.. ఉమ్మడి రాజధానిలో నివసించే వారి రక్షణ, స్వేచ్ఛ, ఆస్తులను కాపాడటంలో గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు  చెందిన వారికి నష్టం కలిగించే ఎలాంటి నిర్ణయాలనైనా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పక్షంలో గవర్నర్ తన విచక్షణ మేరకు సొంత నిర్ణయం తీసుకోవచ్చని కూడా చట్టంలో పేర్కొన్నారని.. అలాంటప్పుడు ఇప్పటివరకు జరిగిన అనేక వివాదాలపై తక్షణం జోక్యం చేసుకుని నివారణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది.

 

 టీ నిర్ణయాలపై మంత్రిమండలిలో చర్చ

 తెలంగాణ ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న పలు నిర్ణయాలపై అవసరమైతే సోమవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో చర్చించి కేంద్రంతో మరోసారి సంప్రదింపులు జరపాలన్న భావనకొచ్చారు. శాంతి భద్రతల విషయంలో స్పష్టత ఇచ్చినట్టే మిగతావాటిపైనా వివరణ ఇవ్వాలని కోరే అవకాశం ఉందని సీనియర్ మంత్రి ఒకరు చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఏపీ నుంచి వచ్చే వాహనాలపై పన్ను విధింపు, ఎంసెట్ కౌన్సెలింగ్, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్థానికత, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) డెరైక్టర్ జనరల్ నియామకం, డెల్టాకు నీటి విడుదల, నదీ జలాల పంపిణీపై అపెక్స్ కమిటీ వంటి విషయాలన్నింటిపైనా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top