వచ్చే 20 ఏళ్లలో మార్పులకు దీటుగా..  | AP government is committed to reform in education | Sakshi
Sakshi News home page

వచ్చే 20 ఏళ్లలో మార్పులకు దీటుగా.. 

Nov 18 2019 3:19 AM | Updated on Nov 18 2019 5:19 AM

AP government is committed to reform in education - Sakshi

సాక్షి, అమరావతి : ‘విద్య, ఉపాధి రంగాల్లో సమాజంలోని అందరికీ సమాన అవకాశాలు కల్పించడంతో పాటు వచ్చే 20 ఏళ్లలో జరిగే మార్పులకు అనుగుణంగా విద్యను ఆధునికీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగావకాశాలు మెండుగా ఉండే రంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పుల మేరకు యువతకు విద్యను అందించాలనే ప్రణాళికతో ముందుకెళ్తోంది. అందులో భాగమే ఇంగ్లిష్‌ మీడియం వంటి నిర్ణయాలు’ అని ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  రాబోయే 20 ఏళ్లలో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయని, నాలెడ్జ్, డిజిటల్‌ ఎకానమీగా రూపాంతరం చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(కృత్రిమ మేధ), బయో టెక్నాలజీ రంగాలకు డిమాండ్‌ పెరుగుతుందని, అందుకనుగుణంగా ఇప్పటి నుంచే యువతను సన్నద్ధం చేయాలంటే ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్న వారిలో 82 శాతం ఉన్నత వర్గాలకు చెందిన ధనవంతుల పిల్లలేనని, వారితో పోటీపడేందుకు పేద, మధ్యతరగతి పిల్లల కోసమే ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతోందని ఒక సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రుల డిమాండ్‌ మేరకే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారని, సమాజంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు.
 
ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన చేరికలు 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమ్మఒడి, ఇంగ్లిష్‌ మీడియంపై విస్తృత ప్రచారం వల్ల ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది కొత్త ప్రవేశాలు భారీగా పెరిగాయి. కొత్తగా 6.5 లక్షల మంది విద్యార్థులు చేరారని గణాంకాలు చెబుతున్నాయి. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడతామన్న హామీ నేపథ్యంలో ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి 2.7 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చేరారు.   

చకచకా ఏర్పాట్లు  
సీఎంఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నాం. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్, పరీక్షా విధానాలకు  దీటుగా రాష్ట్ర సిలబస్‌ రూపొందిస్తాం. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌లోని మంచి అంశాలను, ఇతర రాష్ట్రాల్లోని సిలబస్‌ను అధ్యయనం చేసి మెరుగైన అంశాలను తీసుకుని కొత్త సిలబస్‌ తయారు చేస్తాం. ఇందుకు 27 మందితో సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటైంది. సబ్జెక్ట్‌ సిలబస్‌ రూపొందించిన తరువాత సమీక్షించడానికి ఒక బృందాన్ని, ఎడిటింగ్‌కు మరో బృందం ఏర్పాటు చేశాం. ప్రతీ ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లిష్‌ డిజిటల్‌ ల్యాబ్‌ ఏర్పాటవుతుంది. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా ఇంగ్లిష్‌ గ్రామర్‌తో పాటు రాయడం, చదవడం, భాషపై పట్టు సాధించడానికి ఈ ల్యాబ్‌ దోహదం చేస్తుంది. 
-పీవీ రమేశ్, ముఖ్యమంత్రి ప్రత్యేక సీఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement