కూలుతున్న గంజాయి కోటలు

AP Government Actions On Marijuana Smuggling - Sakshi

ఫలిస్తున్న ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ

సాగుపై నిషేధం.. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం

నిఘా పెంచి.. అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ఆరు నెలల్లోనే రూ.60 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

95 కేసులు నమోదు..  245 మంది అరెస్టు

మూడోవంతుకు పరిమితమైన పంట సాగు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఏజెన్సీలో నాడు టీడీపీ నేతల అండతో పెచ్చరిల్లిన్న గంజాయి మాఫియా సామ్రాజ్యాన్ని కూలగొట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. గంజాయి సాగు నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయడంతో పాటు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ దాడులు చేస్తూ దశాబ్దం నుంచి వేళ్ళూనుకున్న స్మగ్లర్ల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ఆరు నెలల వ్యవధిలోనే 95 కేసులు నమోదు చేసి 245 మందిని అరెస్టు చేయడంతో పాటు సుమారు రూ.60 కోట్ల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మన్యంలో గంజాయి వనాలను కూకటివేళ్లతో పెకిలిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే ఆ మాట నిలబెట్టుకుంటూశరవేగంగా చర్యలు చేపట్టారు. ఫలితంగా తక్కువ వ్యవధిలోనే సాగు మూడొంతులకు పడిపోయింది.

పదేళ్ల క్రితం నుంచే..
గంజాయి ఖిల్లాగా మారిన విశాఖ మన్యంలో ఆ పంట సాగు పదేళ్ళ కిందటే పురుడుపోసుకుంది. హుకుంపేట మండలం మారుమూల ప్రాంతమైన సరసపాడు అటవీ ప్రాంతంలో ఈ సాగు తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. మన్యం దిగువన ఉన్న దేవరాపల్లి మీదుగా గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వీలుగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుని తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు అమాయక గిరిజనులతో గంజాయి సాగు చేపట్టారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్నా అప్పటి పాలకులు సరిగ్గా పట్టించుకోని నేపథ్యంతో గిరిజనులు గంజాయి సాగు పట్ల ఆకర్షితులయ్యారు. దీంతో క్రమేపీ పంట విస్తీర్ణం పెరిగి పదివేల ఎకరాలు దాటిపోయింది. ఓ దశలో సాధారణ పంటల సాగుకంటే గంజాయి సాగు వైపే పూర్తిగా మొగ్గుచూపే పరిస్థితి వచ్చేసింది. ఏజెన్సీలోని మొత్తం 11 మండలాలకు గానూ ఏడు మండలాలు.. జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, చింతపల్లి మండలాలకు గంజాయి సాగు విచ్చలవిడిగా విస్తరించింది.

ఆరు నెలల్లోనే అనూహ్య మార్పు..
గంజాయి సాగు, రవాణా నిరోధంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైన పరిస్థితులను గిరిజనులే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్ళారు. గంజాయి స్మగ్లింగ్‌ వల్ల అనేక మంది గిరిజనులు జైలు పాలవుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు వాపోయేవారు. అదే సమయంలో విశాఖ నగరంలో యువత గంజాయికి బానిసలుగా మారిన తీరు ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. దాంతో అధికారంలోకి వచ్చాక గంజాయి సాగును పూర్తిగా నిర్మూలిస్తామని ఎన్నికల సమయంలో జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కాగానే గంజాయి నిర్మూలనకు అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు, అధికారాలు ఇచ్చారు.

ఎక్సైజ్, ఫారెస్ట్, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో గిరిజనులు గంజాయి సాగు జోలికి పోకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని, కాఫీ సాగు విస్తరించాలని సీఎం సూచించారు. ఆ మేరకు అధికారులు వెంటనే రంగంలోకి దిగి స్మగ్లర్లకు ముకుతాడు వేసే దిశగా చర్యలు చేపట్టారు. నిఘా తీవ్రతరం చేసి తక్కువ వ్యవధిలోనే ఎన్నడూ లేనన్ని  కేసులు నమోదు చేశారు. ఫలితంగా గత ఏడాది వరకు సగటున పదివేల ఎకరాల్లో సాగైన గంజాయి విస్తీర్ణం ఇప్పుడు మూడు వేల ఎకరాలకు పరిమితమైంది. అది కూడా పూర్తిగా మారుమూల అటవీ ప్రాంతాలు, ఏవోబీ పరిధిలోకి వచ్చే ఒడిశా సరిహద్దు గ్రామాల్లోనే సాగవుతున్నట్టు అధికారులు గుర్తించారు.

స్వచ్ఛందంగా సాగుకు స్వస్తి..
గంజాయి సాగు వద్దని ప్రభుత్వం నిర్వహిస్తున్న చైతన్య కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటలకు ఇస్తున్న ప్రోత్సాహంతో గిరిజనులు స్వచ్ఛందంగా గంజాయి సాగు విడనాడారు. ప్రతి ఏటా జూలై, ఆగస్టు నెలల్లో ఈ పంట సాగు ప్రారంభిస్తారు. అయితే జూన్‌ నుంచే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడంతో గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. జి.మాడుగుల, పెదబయలు మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఈ ఏడాది గంజాయి సాగును పూర్తిగా విరమించారు. ప్రభుత్వ పిలుపు మేరకు గంజాయి సాగును విరమించిన గిరిజనులు తమ దుస్థితిని, అవసరాలను అధికారులకు విన్నవించుకుంటున్నారు. వ్యవసాయ యంత్ర పనిముట్లు కావాలనిఅధికారులను కోరుతున్నారు.

ఏజెన్సీలో ఐదు తాత్కాలిక చెక్‌పోస్టులు..
ఏజెన్సీలో చాలా చోట్ల గంజాయి సాగుకు అడ్డుకట్ట వేశాం. గతంలో పండించిన పంట రవాణాను నిరోధించేందుకు ఐదు తాత్కాలిక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. శివలింగాపురం, భీమవరం, డౌనూరు, గరికనంద, జీనపాడు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు నెలకొల్పాం. గంజాయి పండించినా, అక్రమ రవాణా చేసినా నారోటిక్స్, డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌(ఎన్‌డీపీఎస్‌)–1985  ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
– టి. శ్రీనివాసరావు, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌

పెంచి పోషించిన టీడీపీ నేతలు..
2014లో టీడీపీ అధికారం చేపట్టాక గంజాయి స్మగ్లింగ్‌ బహిరంగ వ్యాపారంగా మారిందంటే అతిశయోక్తి కాదు. సాగు, అక్రమ రవాణాలో అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులే కీలకంగా మారారు. గంజాయి రవాణాకు ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, ఓ మాజీ మంత్రి పూర్తిస్థాయిలో అండదండలు అందించేవారనేది బహిరంగ రహస్యం. స్వయంగా ఆయనే ఈ మాఫియాకు డాన్‌గా చెలామణీ కావడంతో స్మగ్లర్లకు ఎదురు లేకుండా పోయింది. మాజీ మంత్రి అనుచరులు, సన్నిహితులైన టీడీపీ నేతలతో పాటు మన్యంలోని టీడీపీ నేతలు కూడా స్మగ్లర్లతో చేతులు కలిపారు. గంజాయి సాగు,   రవాణాను అడ్డుకోవాల్సిన అధికారుల చేతులు కట్టేయడంతో ఏజెన్సీలో పండిన గంజాయి యధేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిపోయేది.

కేసుల కోసం అడపాదడపా ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేసినట్టు చూపించినప్పటికీ అసలు స్మగ్లర్లను వదిలేసి కూలి డబ్బుల కోసం సరుకును రవాణా చేస్తున్న గిరిజనులు మాత్రమే కటకటాల పాలయ్యేవారు. దీనికి 2014 ఆగస్టు 9 నాటి ఘటనే ఉదాహరణ. పెదబయలు మండలం గోమంగి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన అంబులెన్స్‌లో భారీఎత్తున గంజాయి తరలిస్తుండగా పోలీసులు సుండ్రుపుట్టు రోడ్డులో పట్టుకున్నారు. ఈ కేసులో  డ్రైవర్‌ సీదరి మత్స్యరాజును అరెస్టు చేయగా.. ఆయన అసలు సూత్రధారులైన టీడీపీ నేతల పేర్లు వెల్లడించారు. కానీ నాటి పాలకుల ఆదేశాలతో ఈ కేసును ఒక్క డ్రైవర్‌ అరెస్టుతోనే సరిపెట్టేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top