వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం,
పశ్చిమగోదావరి జిల్లాలో కూడా పర్యటన
సాక్షి,హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో మరో రోజు అదనంగా పర్యటించనున్నారు. తొలుత ఆయన ఈ నెల 2న విశాఖ, 3న తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఇప్పుడు అదనంగా మరో రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పర్యటిస్తారని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 2, 3, 4 తేదీల్లో జగన్ పర్యటన వివరాలు ఆయన వెల్లడించారు. జూలై 2న ఉదయం 11 గంటలకు జగన్ విశాఖ చేరుకుని యలమంచిలి నియోజకవర్గంలోని అచ్యుతాపురం గ్రామానికి వెళతారు.
ఇటీవల గోదావరి ధవళేశ్వరం బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబీకుడు ఈగల అప్పారావును పరామర్శిస్తారు. అటు నుంచి తునిలోని పెరుమాళ్లపురానికి వెళ్లి ఇటీవల వాయుగుండంలో గల్లంతైన మత్స్యకారుల ఇళ్లను సందర్శిస్తారు. రాత్రికి కాకినాడలో బస చేసి, 3వ తేదీ ఉదయం కాకినాడ, కాకినాడ రూరల్ (పగడాలపేట) ప్రాంతాలను సందర్శిస్తారు. అక్కడ కూడా ఇటీవల గల్లంతైన మత్స్యకారుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబీలను కలుసుకుంటారు. అదే రోజు రంపచోడవరంలోని సూరంపల్లికి వెళతారు. అక్కడ ఇటీవల ఓ వ్యాన్ బోల్తాపడిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబీకులను పరామర్శిస్తారు. 4వ తేదీ ఉదయం గోపాలపురం నియోజక వర్గంలోని దేవరపల్లి గ్రామంలో పొగాకు బోర్డు ప్రాంగణానికి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుంటారు. తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.