
సాక్షి, అమరావతి: ఒకవైపు ప్రకృతి ప్రకోపం.. మరోవైపు గత సర్కారు నిర్లక్ష్యం వెరసి ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో బలవన్మరణాలు పెరిగాయి. ఇందుకు సంబంధించి తాజాగా విడుదలైన ఎన్‌సీఆర్‌బీ–2018 నివేదికలోనూ ఏపీ నాలుగో స్థానంలో కొనసాగింది. 2014లో రైతు ఆత్మహత్యల్లో ఏపీ 7వ స్థానంలో ఉండగా.. 2015లో 6వ స్థానానికి చేరింది. 2016లో అన్నదాతల ఆత్మహత్యలు భారీగా పెరగ్గా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు వెల్లువెత్తడంతో అప్పటి ప్రభుత్వం ఎన్‌సీఆర్‌బీకి లెక్కలు తగ్గించి పంపించిందన్న విమర్శలున్నాయి. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పడితే, ఆ ఏడాదీ ఏపీ 4వ స్థానానికి చేరడం గమనార్హం. ఆ తరువాత 2017, 2018 ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం మన రాష్ట్రం 4వ స్థానంలోనే కొనసాగింది. ఇలా చంద్రబాబు పాలనలో 7, 6 స్థానాల నుంచి నాలుగో స్థానానికి దిగజారి రైతుల ఆత్మహత్యల్లో హ్యాట్రిక్ సాధించినట్లైంది.
ఐదేళ్లలో 3,832 మంది..
ఎన్‌సీఆర్‌బీ నివేదికల ప్రకారం 2014 నుంచి 2018 వరకు రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో 3,832 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో సొంత భూమి గల రైతులు 1,043 మంది, కౌలు రైతులు 612 మంది, కూలీలు 2,177 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెరిగాయి
అన్నదాతల ఆత్మహత్యలను నిలువరించడంలో గడచిన ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా గట్టి ప్రయత్నాలే జరిగాయి. తద్వారా పలు రాష్ట్రాలు మంచి ఫలితాలు సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చివరి మూడేళ్లూ ఆత్మహత్యలు పెరిగాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు వివిధ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మరణాలను నిరోధించగలిగాయి. 2014లో 4వ స్థానంలో ఉన్న కేరళ రైతులను ఆదుకుని బలవన్మరణాలను నివారించడంలో మంచి ఫలితాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో మరణాలు మరింత పెరిగాయనే విమర్శలున్నాయి.