
ఆంధ్రజాతీయ కళాశాల
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: ఇంటర్మీడియెట్ ఫలితాల సాధనలో కృష్ణా జిల్లా అగ్రగామిగా నిలిచినా.. మచిలీపట్నంలోని కొన్ని కళాశాలల ఫలితాలు మాత్రం దయనీయంగా వచ్చాయి. మచిలీపట్నంలోని ఏజే (ఆంధ్రజాతీయ) కళాశాల నుంచి 11 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, మొదటి సంవత్సరం ఫలితాల్లో ఇక్కడి విద్యార్థులంతా ఫెయిలయ్యారు. జిల్లాలో 22 ఎయిడెడ్ కళాశాలలు ఉండగా, ఇక్కడి విద్యార్థులు సాధించిన ఫలితాల మేరకు ర్యాంకులను ఇంటర్మీడియెట్ అధికారులు ప్రకటించారు.
ఏజే కళాశాల నుంచి 11 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరుకాగా ఒక్కరు కూడా పాస్‌కాకపోవటంతో ఈ కళాశాలకు సున్నా వేశారు. దీంతో ఫలితాల్లో అట్టడుగున నిలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. అదే విధంగా హిందూ ఎయిడెడ్ కళాశాలలో ఎంపీసీ, సీఈసీ గ్రూపుల నుంచి 65 మంది పరీక్షలు రాయగా, ఇందులో ఐదుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ గ్రూపు నుంచి 21 మందికి ముగ్గురు పాసయ్యారు. సీఈసీ గ్రూపు నుంచి 44 మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న ఆయా కళాశాలల్లో ఇంత అధ్వానంగా ఫలితాలు రావటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.