అంగన్‌వాడీ కార్యకర్తను అసభ్యపదజాలంతో ధూషించారని ఆరోపిస్తూ సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు తహశీల్దార్ నాగేశ్వరరావు, వీఆర్వో బుల్లిబాబులతో వాగ్వాదానికి దిగారు.
ఇల్లెందుఅర్బన్, న్యూస్‌లైన్: అంగన్‌వాడీ కార్యకర్తను అసభ్యపదజాలంతో ధూషించారని ఆరోపిస్తూ సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు తహశీల్దార్ నాగేశ్వరరావు, వీఆర్వో బుల్లిబాబులతో వాగ్వాదానికి దిగారు. హమాలీబస్తీలోని అంగన్‌వాడీ సెంటర్‌ను తహశీల్దార్ తనిఖీ చేసే క్రమంలో కార్యకర్త విజయకుమారిని ఎందుకు ధూషించాల్సి వచ్చిందని అంగన్‌వాడీలు దేవేంద్ర, విజయకుమారి, వెంకటమ్మ, లక్ష్మి తదితరు లు తహశీల్దార్, వీఆర్వోలపై మండిపడ్డారు. సెంటర్‌ను తనిఖీ చేసి విద్యార్థుల హాజరుపట్టికను కార్యాలయానికి తీసుకురావడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఓట్ల నమోదు డ్యూటీలో విజయకుమారి పాల్గొనకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై తహశీల్దార్ మాట్లాడుతూ విజయకుమారికి సంబంధించిన సెంటర్‌ను తనిఖీ చేసిన క్రమంలో 22 మంది చిన్నారులకు బదులు ఇద్దరు మాత్రమే హాజరయ్యారని, కానీ రిజిస్టర్‌లో 22 మంది హాజరైనట్లు ఉందని, ఈ విషయం స్థానికులకు తెలిస్తే గొడవ జరుగుతుందని రిజిస్టర్‌ను కార్యాలయానికి తీసుకువచ్చామని అన్నారు. వీఆర్వో కూడా ఎవరిని అసభ్యపదజాలంతో తిట్టలేదని అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్త వెంకటమ్మ కుమార్తెకు తెల్లరేషన్ కార్డు మంజూరు చేయలేదనే సాకుతో ఇలా చేయిస్తోందే తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదని తహశీల్దార్ అన్నారు. విజయకుమారికి సంబంధించి రిజిస్టర్‌ను మంగళవారం ఇస్తానని, ఆమె ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నారు. దీంతో వాగ్వాదం సర్ధుమణిగింది.