రాజధాని భూముల సర్వేపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు.
గుంటూరు: రాజధాని భూముల సర్వేపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం గుంటూరులో రామకృష్ణారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాజధాని భూములపై ప్రభుత్వం దొడ్డిదారిన ఏరియల్ సర్వే జరుపుతుందని ఆరోపించారు. రోడ్డు మార్గం ద్వారా సర్వే చేస్తే రైతుల ఆగ్రహం చూడాలన్న భయంతోనే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఎప్పటికైనా రోడ్డు మార్గంలో సర్వే చేయాల్సి వస్తుంది... అప్పుడు రైతులు వారిని అడ్డుకుంటారని హెచ్చరించారు.
సింగపూర్ ప్రతినిధులతో పలువురు కేబినెట్ మంత్రులు హెలికాప్టర్ ద్వారా రాజధాని ప్రతిపాదిత ప్రాంతమైన అమరావతి, కృష్ణా పరివాహక గ్రామాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉండవల్లిలో రైతులు నల్ల జెండాలు, నల్ల కాగితాలు చేత పట్టి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాజధాని ఏర్పాటుకు తాము అనుకూలంగానే ఉన్నామన్నారు. కానీ రాజధాని ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు మాత్రం తాము సిద్దంగా లేమని తెలిపారు.