రొయ్య మళ్లీ మీసం తిప్పుతోంది | Sakshi
Sakshi News home page

రొయ్య మళ్లీ మీసం తిప్పుతోంది

Published Tue, Sep 26 2017 8:35 AM

Shrimp Cultivation hike in district

పశ్చిమగోదావరి ,భీమవరం అర్బన్‌ : కొద్ది రోజులుగా వనామీ రొయ్యల సాగుకు వాతావరణం అనుకూలించడంతో రైతులు రొయ్యల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. భీమవరం మండలంలోని కొత్తపూసలమర్రు, అనాకోడేరు, గూట్లపాడు, వెంప, తోకతిప్ప, దెయ్యాలతిప్ప, లోసరి, నాగిడిపాలెం, దిరుసుమర్రు, కొమరాడ తదితర గ్రామాల్లో  సీజన్‌లో 7 వేల ఎకరాలు, అన్‌ సీజన్‌లో 3 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేపడుతుంటారు.

భీమవరం, ఉండి, కాళ్ల, ఆకివీడు మండలాల నుంచి  సుమారు 200 టన్నుల వరకు రొయ్యలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నట్టు ప్రాథమిక అంచనా. దీని ద్వారా వందల కోట్ల రూపాయల విదేశీమారక ద్రవ్యం లభిస్తోంది.  ఈ ఏడాది మొదటి పంటైన ఫిబ్రవరి నుంచి జూన్‌ సీజన్‌లో రొయ్యల సాగులో దిగుబడి ఆశాజనకంగా వచ్చినప్పటికీ  మార్కెట్‌లో సరైన ధర లభించలేదు. దాంతో చాలా మందికి పెట్టుబడి ఖర్చులు రావడమే గగనమైపోయింది. మరికొంత మంది నష్టాలను చవిచూశారు. ప్రస్తుతం చెరువుల్లో సీడ్‌ దశ నుంచి 100 కౌంట్‌ దశలో రొయ్యలు ఉన్నాయి.

ఈసీజన్‌పై ఆక్వా రైతుల దృష్టి : ఏటా సీజన్‌లో మాత్రమే రైతులు రొయ్య సాగు చేసి మిగిలిన సమయంలో వైరస్‌ ఎక్కువగా ఉండటంతో చేపల పెంపకం సాగించేవారు. ఈ ఏడాది అగస్టు నుంచి ఎండలు ఎక్కువగా ఉండి రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో వనామీ సీడ్‌ను చెరువులలో వదులుతున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే రొయ్యలు వైరస్‌ బారిన పడవని రైతులు చెబుతున్నారు.

ఆశాజనకంగా ధరలు
మండలంలో ఎక్కడా పట్టుబడికి వచ్చిన రొయ్యలు లేకపోవడంతో మార్కెట్‌లో రొయ్యల ధర చుక్కలనంటుతోంది. గత 20 రోజుల క్రితం నుంచి చూస్తే కౌంట్‌కు రూ.70 నుంచి రూ.100 వరకు ధర పెరిగింది. అధిక దిగుబడి ఉంటే  30 కౌంట్‌ 440, 40 కౌంట్‌ 420, 50 కౌంట్‌ 370, 60 కౌంట్‌ 350, 70 కౌంట్‌ 330, 80 కౌంట్‌ 300, 90 కౌంట్‌ 280, 100 కౌంట్‌ 250 ఇస్తున్నట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

సన్న, చిన్నకారు రైతులను ఆదుకోవాలి
వనామీ సాగు వల్ల రాష్ట్రానికి వందల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. సన్న, చిన్నకారు రైతులకు రాయితీలు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ రంగంలో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. – నాగిడి నారాయణస్వామి, వనామీ రైతు, నాగిడిపాలెం

నకిలీలను అరికట్టాలి
రొయ్య పిల్ల వేసేటప్పుడు నాణ్యత తెలియడం లేదు. దీంతో రొయ్యలు వైరస్‌ బారిన పడి చనిపోతున్నాయి. లక్షలాది రూపాయలు నష్టపోతున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకుని నకిలీ మందులు, హేచరీలను అరికట్టాలి. – తిరుమాని తులసీరావు, వనామీ రైతు, కొత్తపూసలమర్రు

Advertisement
Advertisement