రాష్ట్ర విభజన నిర్ణయూన్ని జీర్ణించుకోలేక గురువారం ఓ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోగా 8మంది గుండెపోటుతో మరణించారు.
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రాష్ట్ర విభజన నిర్ణయూన్ని జీర్ణించుకోలేక గురువారం ఓ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోగా 8మంది గుండెపోటుతో మరణించారు. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఎంబీఏ విద్యార్థి సందీప్ గురువారం సాయంత్రం స్థానిక రైల్వేగేటుకు సమీపంలో రైలుకిందపడి బలవన్మరణం చెందాడు. సందీప్ జేబులో సమైక్యాంధ్రకు మద్దతుగా రాసిన లేఖ బయటపడింది. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో పంచాయతీరాజ్ ఉద్యోగి గిరిజాల ప్రసాద్ (36), భీమడోలు మండలం వడ్లపట్లకు చెందిన శృంగవృక్షం వెంకమ్మ (60) రాష్ట్ర విభజనపై చుట్టుపక్కలవారితో ఆవేశంగా చర్చిస్తూ గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు.
మొగల్తూరు మండలం పేరుపాలెం ఉత్తర పంచాయతీకి చెందిన కూలి గట్టెం శ్రీను (20), దెందులూరు మండలం కొవ్వలికి చెందిన కట్టా వెంకటేశ్వరరావు (63), కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని హుసేనాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త తలారి శేషయ్య(22) టీవీలో వార్తలు చూస్తూ ఉద్వేగానికి గురై మరణించారు. అనంతపురం జిల్లా హిందూపురం మండలం సుబ్బిరెడ్డిపల్లికి చెందిన నంజుండప్ప (45) నినాదాలు చేస్తూ, రొళ్ల మండలం వడ్రహట్టికి చెందిన బి.తిమ్మప్ప (65), బత్తలపల్లి మండలం వెంకటగారిపల్లెకు చెందిన నాగార్జున (46) గుండెపోటుతో మృతి చెందారు.