చంద్రబాబుపై 420 కేసులు | 420 cases against Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై 420 కేసులు

Jun 8 2016 2:29 AM | Updated on Aug 17 2018 8:06 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినందుకు బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల పోలీస్‌స్టేషన్లలో .....

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినందుకు బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల  పోలీస్‌స్టేషన్లలో 420 కేసులు పెడుతున్నట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఆయన మంగళవారం నగర పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నికల  వేళ చంద్రబాబు అన్ని వర్గాలకు ఐదారు వందల హామీలు గుప్పించారని, వాటిని నమ్మి ప్రజలు ఓట్లేశారని చెప్పారు. కానీ సీఎం పదవి చేపట్టి రెండేళ్లవుతున్నా వాటిని అమలు చేయలేదని,  ఈ రెండేళ్లలో సీఎం తన స్వార్థ ప్రయోజనాలకు, కుమారుడు లోకేష్, తమ వారి కోసమే అధికారాన్ని వాడుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజలను నమ్మించి మోసం చేసిన సీఎంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు 420 కేసులు పెట్టనున్నారని వివరించారు.


కేంద్రం నుంచి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు బడ్జెట్ వంటి  విభజన హామీలు సాధించడంలోనూ ఆయన విఫలమయ్యారని, రాజధాని తరలింపుపై ఉన్న శ్రద్ధ హామీల అమలులో చూపడం లేదని దుయ్యబట్టారు. పదేళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉంచేందుకు  కేంద్రం వెసులుబాటు ఇచ్చినా చంద్రబాబును కే సీఆర్ ఏం బెదిరించారో గాని కొత్త రాజధానిపై తొందరపడుతున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాక సీఎం కేంద్రానికి సరెండరై పోయారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో నవనిర్మాణ దీక్ష ఎందుకో అర్థం కావడం లేదని, కేవలం జగన్‌ను విమర్శించేందుకే దీక్షను వినియోగించుకుంటున్నారన్నారు. ‘చెప్పు’ అనగానే టీడీపీ నేతలు ఉలికిపడుతున్నారని, 1995లో ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన సంగతి వీరికి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ మంచి జరిగినా తన వల్లేనంటారని, సత్యనాదెళ్ల తన వల్లే స్ఫూర్తి పొందారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయకుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజానీకాన్ని మోసం చేశారని, యువతరాన్ని దగా చేశారన్నారని అందువల్లే ఆయనపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు 420 కేసులు పెడుతున్నారని చెప్పారు. 


టీడీపీ నేతలు నవనిర్మాణ దీక్షకు బదులు విభజన హామీలు అమలు చేయాలని ఢిల్లీలో దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి,  గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, బీసీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పక్కి దివాకర్, రొంగలి జగన్నాథం, అనుబంధ సంఘాల నాయకులు పసుపులేటి ఉషాకిరణ్, మహ్మద్ షరీఫ్, బోని శివరామకృష్ణ, బర్కత్‌ఆలీ, శ్రీదేవి వర్మ పాల్గొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement