ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం..! 

20 Lakhs Duplicate Voters In Two Telugu States - Sakshi

రెండు రాష్ట్రాల్లో 20 లక్షల డూప్లికేట్‌ ఓట్లు 

2014లో రెండుచోట్లా ఓటు వినియోగం

సాక్షి, హైదరాబాద్‌: ‘నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. అన్న డైలాగ్‌ ఏపీ, తెలంగాణల్లో చాలా ఫేమస్‌. తెలుగు ప్రజలు మాత్రం ఓటు నమోదు విషయంలో ఈ డైలాగ్‌ను ఎప్పుడో ఫాలో అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు నమోదు చేసుకొని, అక్కడా ఇక్కడా ఓటేస్తున్నారు. రెండు చోట్లా ఎన్నికల్లో పాల్గొని తమ సత్తా చాటుతున్నారు. అయితే, ఇది స్వల్ప మొత్తంలో ఉంటే ఫరవాలేదు. కానీ, పార్టీల భవితవ్యాన్ని, ప్రభుత్వాల్ని మార్చగలిగే స్థాయిలో అంటే.. అక్షరాలా లక్షల సంఖ్యలో ఉండటం గమనార్హం.
 
లక్షల సంఖ్యలో డూప్లికేట్‌ ఓటర్లు.. 
2018 నవంబర్‌ వరకు సుమారు 20 లక్షల మంది రెండు చోట్ల ఓటుకు నమోదు చేసుకున్నారు. వీరిలో ఉమ్మడి ఏపీ నుంచి 2014 రాష్ట్ర విభజన వరకు ఈ ఓటర్లు రెండు రాష్ట్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విభజనకు పూర్వం రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలు, 42 పార్లమెంటు స్థానాలు ఉండేవి. ఈ స్థానాలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపడం కష్టతరం కావడంతో ఏపీలో ఒక దశలో, తెలంగాణలో మరో దశలో నిర్వహించేవారు. ఆ సమయంలో చాలామంది తెలంగాణ, ఏపీల్లో ఓటు నమోదు చేయించుకున్నారు.రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఏప్రిల్‌ 30న, ఏపీలో మే 7వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలోనూ వీరిలో చాలామంది ఇక్కడా, అక్కడా ఓట్లేశారు.  ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, ఏకంగా 52 లక్షల బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని ఆరోపిస్తూ గతేడాది హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దీనికి అప్పటి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి స్పందించారు. ఇందులో ఒకే పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు, వయసు తదితర వివరాలను పోల్చి చూసి, రెండు రాష్ట్రాల్లో  దాదాపుగా 18.2 లక్షల మందికిపైగా ఉన్నారని సమాధానం ఇచ్చారు. వీరంతా రెండు చోట్లా ఓటుహక్కు కలిగి ఉన్నారని అధికారులు గుర్తించారు.  

ఒకేదశలో ఎన్నికలు రావడంతో.. 
గతంలో తెలంగాణ, ఏపీలో వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహించేవారు. కానీ , ఈసారి రెండు రాష్ట్రాలకు మొదటిదశలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఓటర్లు ఏదో ఒక ప్రాంతంలోనే ఓటు వేయగలరు. వీరిలో అధికశాతం హైదరాబాద్‌ నగరంలోనే ఓటు హక్కు కలిగి ఉండటంతో.. అదే రోజు ఏపీకి వెళ్లి ఓటు వేయడం దాదాపుగా అసాధ్యం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top