మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ చార్జీలు లేవు

There are no parking charges at multiplexes - Sakshi

పార్కింగ్‌ బాదుడుపై స్థానిక సంస్థలకు ఫిర్యాదు చేయవచ్చు

సమాచార హక్కు చట్టం కింద పట్టణ ప్రణాళికా శాఖ వెల్లడి

కోర్టు తీర్పులున్నా మల్టీప్లెక్స్‌లు పార్కింగ్‌ చార్జీల వసూళ్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని థియేటర్లు, మల్టీప్లెక్స్‌ కాంప్లెక్సులు, మల్టీప్లెక్స్‌ థియేటర్లలోని పార్కింగ్‌ చార్జీల వసూళ్లకు చెక్‌ పడింది. పార్కింగ్‌ చార్జీలు వసూలు చేయరాదని గతంలో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినా యాజమాన్యాలు పార్కింగ్‌ ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ కాంప్లెక్సుల్లో వస్తువుల కొనుగోలుకు వెళ్లిన వాహనదారుల నుంచి యాజమాన్యాలు ముక్కుపిండి మరీ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇక మల్టీప్లెక్స్‌ థియేటర్లు, సాధారణ థియేటర్లు ఇష్టం వచ్చిన రీతిలో పార్కింగ్‌ చార్జీలను వసూలు చేస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇవి మరింత భారంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ధియేటర్ల యాజమాన్యాలు మోటారు సైకిళ్లకు రూ. 20, కార్లకు రూ. 40, ఆటోలకు రూ. 30, సైకిళ్లకు రూ.10 చొప్పున పార్కింగ్‌ చార్జీలుగా వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 16 మల్టీప్లెక్స్‌ల్లో 58 స్క్రీన్‌లు, 2,809 థియేటర్లు ఉన్నాయి. పార్కింగ్‌ చార్జీలు వసూలు చేయరాదనే కోర్టు తీర్పులున్న విషయం వాహనదారులకు తెలియకపోవడం, చార్జీల బాదుడును నియంత్రించాల్సిన స్థానిక సంస్థలు పట్టించుకోకపోవడంతో పార్కింగ్‌ వసూళ్ల దందా కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన న్యాయవాది వి.హరనాథ్‌బాబు సమాచార హక్కు చట్టం కింద పార్కింగ్‌ చార్జీల వివరాలు కోరుతూ రాష్ట్ర పట్టణ, ప్రణాళికశాఖ సంచాలకులకు ఈ నెల 10న అర్జీ పెట్టారు. దీనిపై ఆ శాఖకు చెందిన ప్రజా సమాచార అధికారి స్పందిస్తూ, పార్కింగ్‌ ఫీజులు వసూలు చేసేలా ఎటువంటి నియమ నిబంధనలు, ఉత్తర్వులు లేవంటూ హరనాథ్‌బాబుకు వివరణ ఇచ్చారు.

పార్కింగ్‌ చార్జీలను వసూలు చేస్తున్న మల్టీప్లెక్సులు, థియేటర్లపై స్థానిక సంస్థలకు వాహనదారులు ఫిర్యాదు చేయవచ్చని ఆ లేఖలో స్పష్టం చేశారు. కాగా, పార్కింగ్‌ చార్జీలు వసూలు చేయరాదని 2003 మే నెలలో హైకోర్టు తీర్పు నిచ్చిందని, సీహెచ్‌ మదన్‌ మోహన్‌ అండ్‌ అదర్స్‌ వర్సెస్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కేసులో మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు, మల్టీప్లెక్స్‌ థియేటర్లు, సాధారణ థియేటర్లు పార్కింగ్‌ చార్జీలు వసూలు చేయకూడదనే తీర్పు ఉందని హరనాథ్‌బాబు స్పష్టం చేశారు.

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top