
‘మోహినీ’ అలంకరణలో సింహరూపుడు
ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎగువ అహోబిలంలో సింహరూపుడైన లక్ష్మీనృసింహస్వామి జగన్మోహినీ అలంకరణతో భక్తులను కనువిందు చేశారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత జ్వాలా నరసింహ స్వామిని యాగశాలలో కొలువుంచి నవకలశ స్థాపన గావించారు. ప్రహ్లాదవరదుడిని నూతన పట్టుపీతాంభరాలతో మోహినీగా అలంకరించి పల్లకీలో కొలువుంచి భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య తిరుమాడ వీధుల్లో ఊరేగించారు.
రెక్కల కష్టాన్ని దోచేస్తారా?
● ఏపీఓను నిలదీసిన ‘ఉపాధి’ కూలీలు
పగిడ్యాల: దినసరి వేతనాలు తక్కువ వేస్తున్నారని ‘ఉపాధి’ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రెక్కల కష్టాన్ని దోచేస్తారా’ అంటూ ఏపీఓ మద్దిలేటిని నిలదీశారు. స్థానిక కార్యాలయానికి మంగళవారం ఉపాధి కూలీలు వచ్చారు. సంకిరేణిపల్లె, ముచ్చుమర్రి, నెహ్రూనగర్ గ్రామాల్లో ఆరు రోజులకు వేతనాలు వేస్తున్నారని, పగిడ్యాల, బీరవోలు, పాలమర్రి గ్రామాల్లో మాత్రం నాలుగు రోజులకే వేతనాలు వేసి కూలీలకు కోత విధిస్తున్నారని మండిపడ్డారు. ఆరు రోజులు పనిచేస్తే నాలుగు రోజులకు మాత్రమే డబ్బులు ఎలా వేస్తున్నారని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా చేస్తున్నందునే అలా వేస్తున్నారని ఏపీఓ మద్దిలేటి వెల్లడించారు.
12 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20వ తేది వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మద్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 21,342 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 15,292.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,032 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 52 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్ ఫెయిల్ అయిన విద్యార్థులకు, గైర్హాజరైన వారికి ఈ నెల 28వ తేది నుంచి జూన్ 1వ తేది వరకు కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే వీటిని నిర్వహించనున్నారు.
కొత్తిమీర అ‘ధర’హో
గోనెగండ్ల: ఒక్కసారిగా కొత్తిమీర ధర పెరిగిపోయింది. ఒక మడి ధర రూ. వెయ్యి నుంచి రూ. 1,200 వరకు పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్తిమీరకు డిమాండ్ పెరిగింది. గోనెగండ్ల మండలంలో బోర్లు,బావుల కింద 1,500 ఎకరాల్లో రైతులు కొత్తిమీర పంటను సాగుచేశారు. ఈ ఏడాది ఉల్లి, మిరప తదితర పంటలు సాగుచేసిన రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కొత్తిమీర పంటకు రెండు రోజుల నుంచి ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.