
వాహన అనుమతిపై సందిగ్ధం
● పది రోజులుగా యజమాని పరేషాన్ ● ఆర్టీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారీ వాహనాల అనుమతిలో కంపెనీ పేర్కొన్న.. రవాణా శాఖ అధికారులు ఇచ్చే అనుమతుల్లో తేడాలు వస్తున్నాయి. జిల్లాలోని కోటపల్లి మండలం కొల్లూరుకు చెందిన జంగా రమేశ్‌రెడ్డి ఆరు టైర్ల ఇంజన్ కలిగిన ఐదు భారీ వాహనాలు కొనుగోలు చేశారు. ట్రెలర్‌తో కలిపి 22టైర్ల డబుల్ క్రోన్(టైర్ల సస్పెన్షన్) వాహనానికి జీవీడబ్ల్యూ(గ్రాస్ వెయిట్ వెహికిల్) 55టన్నులు(ఖాళీ ఇంజిన్, మోసే బరువు సహా) సామర్థ్యం అనుమతి ఇచ్చారు. మరో 18టైర్ల సింగిల్ క్రోన్ నా లుగు వాహనాలకు 54టన్నులు అనుమతి కోరితే, స్థానిక ఎంవీఐ తనిఖీ చేసి 45.5టన్నులకే అనుమతి ఇచ్చారని తెలిపారు. వాహన కంపెనీ ప్రతినిధులు 54టన్నుల జీవీడబ్యూతో ఎస్టీఏ(స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ) అనుమతి ఉందని చెబితేనే కొనుగోలు చేశానని, గత పది రోజులుగా యజమాని ఆర్టీఏ అధికారులు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నిబంధనల మేరకే సామర్థ్య అనుమతి ఇచ్చామని, ఏదైనా జీవో ఉంటే తీసుకు రావాలంటూ డీటీవో సంతోశ్‌కుమార్ యజమానికి సూచించారు. దీంతో ఆ య జమాని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలోనూ సంప్రదించగా, ఇంకా ఈ వాహనాల సామర్థ్యాలపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. వాహన తయారీ కంపెనీ ప్రతినిధులు ఎస్టీఏ నుంచి నిర్ణీత సామర్థ్యానికి అప్రూవ్ ఉందంటున్నారు. రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేశానని, డీడీలకే రూ.6లక్షలకు పైగా చెల్లించానని, తీరా అనుమతి రాకపోతే నష్టపోతానని యజమాని వాపోతున్నారు. దీనిపై డీటీవోను ‘సాక్షి’ వివరణ కోరగా, నిబంధనల మేరకే అనుమతులు ఇచ్చామని, మరోసారి పరిశీ లిస్తామని తెలిపారు. సాధారణంగా ఆర్టీఏ అధికా రులు వాహన ఇంజన్, టైర్లు, సింగిల్, డబుల్ క్రోన్ సామర్థ్యాలు, ముందు, వెనక భాగాల్లో నిర్మాణం, ట్రెలర్ అమరిక, సాంకేతికత, తదితర పరిశీలించి, ఎస్టీఏ ప్రకారం సామర్థ్య అనుమతులు జారీ చేస్తారు. ఆమేరకే వాహనాల్లో లోడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.