
2025–26లో వడ్డీ రేట్లు తగ్గొచ్చు..
ఎస్‌బీఐ అధ్యయనం అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ మొత్తం మీద 125 బేసిస్ పాయింట్ల మేర (1.25–1.5 శాతం) రేట్లను తగ్గించొచ్చని ఎస్‌బీఐ అధ్యయన నివేదిక అంచనా వేసింది. దీంతో మొత్తం మీద రేట్ల తగ్గింపు 150 బేసిస్ పాయింట్లుగా ఉంటుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ అంచనాలకు వచ్చింది. 0.25 శాతం స్థానంలో 0.50 శాతం చొప్పున జంబో రేటు తగ్గింపు చేపడితే అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 3.34 శాతానికి పరిమితం కావడం తెలిసిందే. ఇది 67 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఆహార ద్రవ్యోల్బణం శాంతించడంతో 2025–26 సంవత్సరంలో సగటు సీపీఐ ద్రవ్యోల్బణం 4 శాతం లోపు ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. మరీ మఖ్యంగా ప్రస్తుత త్రైమాసికంలో ఇది 3 శాతంలోపునకు దిగివస్తుందని పేర్కొంది. నామినల్ జీడీపీ (ద్రవ్యోల్బణం మినహాయించని) 9–9.5 శాతం స్థాయిలో 2025–26 సంవత్సరానికి ఉంటుందని (బడ్జెట్ అంచనా 10 శాతం) అంచనా వేసింది. తక్కువ వృద్ధి రేటు, కనిష్ట ద్రవ్యోల్బణం నేపథ్యంలో రేట్ల తగ్గింపునకు అనుకూల తరుణంగా వివరించింది. ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధన విభాగం ఈ నివేదికను రూపొందించింది.
ఆగస్ట్ నాటికి 0.75 శాతం..
‘మార్చిలో కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం దిగిరావడం.. రానున్న కాలంలోనూ పరిమిత స్థాయిలోనే ఉంటుందన్న అంచనాలతో వచ్చే జూన్, ఆగస్ట్ పాలసీ సమీక్షల్లో ఆర్‌బీఐ 75 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చు. తిరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో మరో 50 బేసిస్ పాయింట్ల రేట్లను చేపట్టొచ్చు. దీంతో మొత్తం మీద 125 బేసిస్ పాయింట్ల తగ్గింపునకు అవకాశం ఉంది. ఇప్పటికే ఫిబ్రవరి సమీక్షలో 25 బేసిస్ పాయింట్లను తగ్గించడం జరిగింది’ అని ఈ నివేదిక వెల్లడించింది. కాకపోతే ఒకేసారి 25 బేసిస్ పాయింట్లకు బదులు 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపును చేపట్టడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని భావిస్తున్నట్టు వివరించింది.
ఇదీ చదవండి: అనిశ్చితులున్నా బలమైన వృద్ధి
ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నియంత్రిత స్థాయి అయిన 2–6 శాతం పరిధిలోనే ఉండడాన్ని గుర్తు చేసింది. ఆర్‌బీఐ ఇప్పటికే రెండు విడతల్లో 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించగా, రెపో అనుసంధానిత రుణాలపై ఈ మేరకు ప్రయోజనాన్ని బ్యాంకులు బదిలీ చేసినట్టు తెలిపింది. ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణాలపై రేటు తగ్గింపు ఇంకా ప్రతిఫలించాల్సి ఉందని పేర్కొంది.