
ఉపాధి హామీ పథకం అమలుపై పర్యవేక్షణకు కేంద్రం చర్యలు
ఈ పథకం పనుల ప్రణాళిక, మంజూరుకు కొత్తగా యుక్తధార యాప్
ఏటా అక్టోబరు – ఫిబ్రవరి మధ్య కొత్త పనులు గుర్తింపు
ఒకసారి ఏడాది ప్లానింగ్ పూర్తయ్యాక ఆ పనులకే పరిమితం
ఇస్రో – నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో యాప్ అనుసంధానం
ఎక్కడ ఏ పనులు చేపట్టవచ్చో దీని ద్వారా గుర్తింపు
ఈ ఏడాది మండలానికి ఒక గ్రామ పంచాయతీలో అమలు
వచ్చే ఏడాది అన్ని గ్రామాల్లో అమలు!
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణను మరింత పెంచింది. రాష్రాల్లో పథకం అమలులో దుర్వినియోగానికి తావులేకుండా పలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా పథకం పనుల ప్లానింగ్, మంజూరులో సైతం మార్పులు తెచ్చింది. ఇందుకోసం ‘యుక్తధార’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ఇస్రో – నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో అనుసంధానం చేసింది. తద్వారా ఈ పనులను తన నియంత్రణలోకి తీసుకుంటోంది. ఈ విధానం వల్ల ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు చాలా వరకు తగ్గిపోతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.
చాలా కాలం నుంచి ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను కేంద్రమే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇటీవల మెటీరియల్ కేటగిరీ (సిమెంట్ రోడ్లు లేదా ఇతర కూలీలను ఉపయోగించని) పనుల బిల్లులనూ నేరుగా కేంద్రమే ఆ వ్యక్తులకు, సంస్థలకు చెల్లిస్తోంది. ఇందులో రాష్ట్రాలు వాటి వాటా 25 శాతం నిధులను ఉమ్మడి ఖాతాకు జమ చేస్తేనే కేంద్రం 75 శాతం వాటా కలిపి బిల్లులు చెల్లిస్తోంది. ఇప్పుడు ఈ పథకం పనుల ప్రణాళిక, అమలును కూడా కేంద్రమే ప్రత్యక్షంగా పర్యవేక్షించనుంది.
వచ్చే ఏడాది నుంచి అన్ని గ్రామాల్లో అమలు..
ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. ఏటా పంచాయతీల వారీగా ఉపాధి హామీ పథకం పనుల కల్పన, ప్రణాళికల రూపకల్పన ఆర్థిక సంవత్సరం ఆరంభానికి ముందే అక్టోబరు–ఫిబ్రవరి నెలల మధ్య రాష్ట్ర స్థాయిలో జరుగుతుండేది. ఈ ప్రణాళికలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మార్చి నెలలో రాష్ట్రాలవారీగా సమావేశాలు నిర్వహించి వాటికి లేబర్ బడ్జెట్ పేరుతో ఆమోదం తెలిపేది. కొత్తగా గుర్తించిన పనులను గ్రామ పంచాయతీ లేదా మండల, జిల్లా పరిషత్‌లో తీర్మానం అనంతరం మంజూరు చేసేవారు.
కేంద్రం తెచ్చిన కొత్త విధానం ప్రకారం ఇకపై ఆర్థిక సంవత్సరం మొత్తానికి కేంద్రం ఒకేసారి ఆ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వారీగా లేబర్ బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. ఏడాది మధ్యలో పనులు మంజూరు కావు. ఇలా ఏడాది ప్రణాళిక రూపకల్పనకు ‘యుక్తధార’ మొబైల్ యాప్ ప్రవేశపెట్టింది. ఈ ఏప్రిల్ 1 నుంచి మండలానికి ఒక గ్రామ పంచాయతీ చొప్పున ఈ విధానం అమలు చేస్తుండగా, వచ్చే ఏడాది నుంచి అన్ని గ్రామాల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
పనుల గుర్తింపు కూడా సాంకేతికతోనే..
ఈ పథకంలో అవకతవకలకు సైతం వీలుండదని అధికారులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో చేపట్టడానికి అవకాశం లేని పనులను ప్రణాళికలో చేర్చే అవకాశం ‘యుక్తధార’ యాప్‌లో ఉండదని చెబుతున్నారు. యాప్ పూర్తిగా ఇస్రో ఆధ్వర్యంలో సమగ్ర గూగుల్ మ్యాప్‌నకు అనుసంధానమై ఉండటం వల్ల చెరువులు ఉన్న ప్రాంతంలోనే వాటి పూడిక తీత పనులు చేపట్టే వీలుంటుందని తెలిపారు.
కొన్ని రకాల పనులకు ఆ ప్రాంత భూగర్భ పరిస్థితులు అనుకూలమా లేదా అన్నది కూడా పని నిర్ధారణ సమయంలోనే తెలిసిపోతుందని వివరించారు. తద్వారా పనుల గుర్తింపులో అక్రమాలకు తెరపడుతుందని చెబుతున్నారు.
దొంగ మస్టర్లకూ చెక్!
ఉపాధి హామీ పథకంలో దొంగ మస్టర్లకూ కేంద్రం చెక్ పెట్టబోతోంది. దీని ప్రకారం ఒక ప్రదేశంలో కూలీలు పనిచేసే సమయంలో రోజూ ఉపాధి హామీ పథకం సిబ్బంది ఫొటో తీయాలి. ఆ ఫోటోలో ఉన్న కూలీల సంఖ్య, అక్కడ పనికి హాజరైనట్టు సిబ్బంది మస్టర్ షీట్‌లో నమోదు చేసే కూలీల సంఖ్య ఒక్కటిగా ఉంటేనే ఆ రోజు వేతనాల చెల్లింపు జరుగుతుంది. ఫోటోలో, మస్టర్ షీట్‌లో సంఖ్యలో తేడా ఉంటే ఆ మస్టర్ షీటును పరిగణనలోకి కూడా తీసుకోరు.
ఇస్రో - నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో యాప్ అనుసంధానం
ప్రస్తుతం ఈ పథకం పనుల ప్రణాళిక ఆఫ్ లైన్ విధానంలో రూపొందించి, ఎంత మంది పేదలకు పనులు కల్పిస్తారో సంఖ్య మాత్రమే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకం పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఆ పనుల నంబర్లను పోర్టల్‌లో ఎంటర్ చేసి, వాటికి బిల్లులు పెడుతున్నారు. కొత్త విధానంలో మొబైల్ యాప్ ద్వారా ప్రణాళిక పూర్తిగా ఆన్‌లైన్‌లో రూపొందుతుంది. ఏ పంచాయతీలో ఏ రకమైన పనిని ఏ ప్రదేశంలో చేపడతారో గూగుల్ మ్యాప్‌లో గుర్తించి, యాప్‌లో నమోదు చేస్తారు.
ఈ యాప్ పూర్తిగా ఇస్రో - నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో అనుసంధానమై ఉంటుంది. ఇలా అన్ని పనులు జియో ట్యాగింగ్ చేసి, మ్యాప్‌లోనే ఒక్కో పనికి ఒక్కో నంబరును కేటాయిస్తారు. ప్రతి పనికి అంచనా విలువ సైతం యాప్‌లోనే నమోదు చేస్తారు. ఏ పనికి బిల్లులు పెట్టాలన్నా యాప్‌లో నమోదు చేసిన ప్రకారం వర్క్ ఐడీలను ఎంపిక చేసుకొని బిల్లులు పెట్టాలి.