నర్సుల పోస్టులకు పైరవీలు! | - | Sakshi
Sakshi News home page

నర్సుల పోస్టులకు పైరవీలు!

Published Wed, May 7 2025 1:19 AM | Last Updated on Wed, May 7 2025 1:19 AM

నర్సు

నర్సుల పోస్టులకు పైరవీలు!

● నర్సు పోస్టుల భర్తీలో అక్రమాలు? ● రంగంలోకి దిగిన దళారులు ● అభ్యర్థులకు ఫోన్ల మీద ఫోన్లు ● రూ.3లక్షల నుంచి 5 లక్షల వరకు డిమాండ్‌ ● అధికారులపై కూటమి నేతల ఒత్తిడి

మహారాణిపేట(విశాఖ): ‘హలో మేము విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. మీరు స్టాఫ్‌నర్సు పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారా? మీకు ఆ పోస్టు కావాలంటే డబ్బులు ఇవ్వాలి.’అంటూ కొందరు వ్యక్తులు అభ్యర్థులకు ఫోన్లు చేస్తూ.. డబ్బులు డిమాండ్‌ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో దళారుల బెడద ఎక్కువైంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే ప్రీ ఫైనల్‌ జాబితా విడుదల కాగా.. తుది ఎంపిక జాబితా వెలువడనున్న తరుణంలో కొందరు అభ్యర్థులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన ఒక ముఠా అభ్యర్థుల ఆశలను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పోస్టింగ్‌ ఇప్పిస్తామని నమ్మబలుకుతోంది. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్‌ చేస్తూ బేరసారాలకు దిగుతోంది. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. అటువంటి మోసగాళ్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

రాజకీయ పైరవీలు..

అధికారులపై ఒత్తిడి

నర్సుల పోస్టుల భర్తీ చివరి దశకు చేరుకోవడంతో కొందరు కూటమి నేతలు ఈ పోస్టులను ఆదాయ వనరులుగా మార్చుకోవాలని భావిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు పెద్ద మొత్తంలో ధర నిర్ణయించి.. డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఈ పైరవీలకు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద సంఖ్యలో సిఫార్సు లేఖలు వస్తున్నట్లు సమాచారం. వీటిని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పోస్టుల భర్తీలో వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ డైరెక్టర్‌(ఆర్డీ)పై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి సిఫార్సు లేఖలతో పాటు, వారి వ్యక్తిగత సహాయకుల నుంచి కూడా ఆర్డీకి నిరంతరం ఫోన్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు భారీ స్థాయిలో డిమాండ్‌ ఉండటంతో కొంతమంది బేరసారాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఒక్కొక్క పోస్టుకు రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దళారులను నమ్మవద్దు

పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తయింది., మెరిట్‌ ప్రాతిపదికన పారదర్శకంగా జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణ వంటి కొన్ని అంశాలపై ప్రభుత్వ వివరణ కోసం లేఖ రాశాం. అనుమతి రాగానే పోస్టింగ్‌ ప్రక్రియ చేపతాం. దళారుల మాటలు నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దు. అర్హత, మెరిట్‌, రోస్టర్‌ ప్రకారమే మెరిట్‌ జాబితా తయారు చేస్తున్నాం.

– డాక్టర్‌ రాధారాణి, ఆర్డీ,

వైద్య ఆరోగ్యశాఖ, విశాఖపట్నం

వైద్య ఆరోగ్యశాఖ ఆర్‌డీ ఆఫీసు

పెరిగిన పోస్టులు.. తీవ్రమైన పోటీ

స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీలో ఈసారి పోస్టుల సంఖ్య గణనీయంగా పెరగడం గిరాకీకి కారణమైంది. ప్రారంభంలో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో 106 నర్సు పోస్టులు ఖాళీగా ఉండగా, ఆ తర్వాత మరో 264 పోస్టులు ఈ ప్రక్రియలో చేరాయి. దీంతో మొత్తం 370 పోస్టుల(ఒక సంవత్సరం ఒప్పంద ప్రతిపదికన) భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ డైరెక్టర్‌ కార్యాలయం చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల నుంచి మొత్తం 8,309 దరఖాస్తులు అందాయి. ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు పోటీ తీవ్రంగా నెలకొంది.

నర్సుల పోస్టులకు పైరవీలు!1
1/1

నర్సుల పోస్టులకు పైరవీలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement