
ఉక్కు పీఎఫ్ ట్రస్ట్‌కు బకాయిలు చెల్లింపు
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ట్రస్టుకు యాజమాన్యం బకాయిలు చెల్లించిందని పీఎఫ్ ట్రస్టీలు చీకటి శ్రీనివాసరావు, రామచంద్రరాజు, సైనుబాబు తెలిపారు. ఉద్యోగుల జీతం నుంచి రికవరీ చేసే పీఎఫ్ అమౌంట్‌తోపాటు యాజమాన్యం వాటాను ప్రతీ నెలా ట్రస్ట్‌కు చెల్లించాలన్నారు. అయితే గత ఏడాది ఏప్రిల్ నుంచి వాటి చెల్లింపులు నిలిచి పోయాయన్నారు. దాంతో ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు అప్‌డేట్ చేయలేక పోతున్నామన్నారు. ఈ అంశంపై పీఎఫ్ కమిషనర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారన్నారు. తాము పీఎఫ్ ట్రస్ట్ ప్రతినిధులుగా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చామన్నారు. ఎట్టకేలకు యాజమాన్యం మార్చి 31న మొదట విడతగా రూ. 429 కోట్లు, మంగళవారం రెండో విడతగా రూ. 244 కోట్లు వడ్డీతో సహా చెల్లించినట్టు వారు తెలిపారు. అదే విధంగా ఎస్‌బీఎఫ్ ట్రస్ట్‌కు రూ.35 కోట్లు చెల్లించారన్నారు. దీంతో యాజమాన్యం పూర్తి బకాయిలు చెల్లించినట్లయిందని పేర్కొన్నారు. ట్రస్ట్‌కు చెల్లింపులు చేయడానికి సహకరించిన ట్రస్ట్ చైర్మన్ హేమంత్ కుమార్ ఝా, కార్యదర్శి ఎస్.రామప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.