రెండో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటన అనే భావనను మార్చేశారు. అంతకు ముందు పల్లెబాట, నగరబాట, రైతు చైతన్యయాత్ర, పొలం బడి, రైతు సదస్సులు వంటివి నిర్వహించారు. రెండోసారి పదవిని చేపట్టిన తరు వాత ప్రజలతో ముఖాముఖీ సమావేశమై ప్రభుత్వ పథకాల గురించీ, అవి ప్రజలకు చేరుతున్న తీరు గురించీ, వాటితో చేకూరిన లబ్ధిని గురించీ, మంచిచెడుల గురించీ మాట్లాడాలని అనుకున్నారు. అలాగే భూపంపిణీ, ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు, ఉచిత బియ్యం, ఉచిత విద్యుత్, విద్యార్థి వేతనాలు, పింఛన్లు, రేషన్‌కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలు అమల వుతున్న తీరు గురించి కూడా ప్రజల నుంచే నేరుగా స్పందన తెలుసు కోవాలని ఆశించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ హఠాత్తుగా ఓ గ్రామానికి వెళ్లి, ఏ చెట్టు కిందనో, మరో కూడలిలోనో ‘రచ్చబండ’ పేరుతో కార్య క్రమం నిర్వహించాలని ఆకాంక్షించారు.