ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దల పకడ్బందీ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కుట్ర కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్‌పై హత్యాయత్నం కుట్రకు ప్రభుత్వ పెద్దలు పదును పెట్టిన తీరు కరుడుగట్టిన కిరాయి హంతక ముఠాల తీరును తలదన్నుతోంది. ఈ హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో ఈ ఏడాది జనవరి నుంచి పని చేస్తున్న సంగతి తెలిసిందే. రెస్టారెంట్ యజమాని, అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు హర్షవర్దన్ ప్రసాద్ చౌదరికి ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే తేటతెల్లమైంది.