ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఫలితాలు వెల్లడి కావడానికి ఇక గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో క్షణక్షణానికి ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 36 చోట్ల స్ట్రాంగ్‌రూమ్‌ల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) భద్రపర్చారు. గురువారం ఓట్ల లెక్కింపు జరగనుంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 6 చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గురువారం స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి, పక్కనే ఉన్న కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 25,000 మందికిపైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు. భద్రత కోసం 25,000 మందికిపైగా పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.