రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. జ్వరాలతో జనం విలవిల్లాడుతున్నారు. రాష్ట్రమంతటా డెంగీ కేసులు నమోదవుతున్నా.. ఖమ్మం జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఒక్క బోనకల్ మండలం లోనే 22 మందిని డెంగీ పొట్టనబెట్టుకుంది. డెంగీ ఏ స్థాయిలో విజృంభించిందంటే ఒక్క సోమవారమే రాష్ట్రవ్యాప్తంగా 146 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 67 మందికి డెంగీ ఉన్నట్లు తేలింది. అందులో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 58 మంది ఉన్నారు. డెంగీ దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటివరకు సమగ్ర చర్యలు తీసుకోలేదు. బోనకల్ మండలంలో 22 మంది చనిపోయినా కేవలం ఐదుగురే చనిపోయారని చెబుతోంది. గత మూడు నెలలుగా ఈ మండలంలోని 15 గ్రామాలు డెంగీతో అల్లాడుతున్నాయి. బోనకల్ మండలంలో దేశంలోనే అత్యధికంగా 351 డెంగీ పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.