మైదుకూరు : మైదుకూరు మండలం వరదాయపల్లె ఎస్సీ కాలనీ వద్ద సోమవారం బద్వేలు – మైదుకూరు జాతీయ రహదారిపై ముందు వెళుతున్న కారు, కాలేజీ బస్సును బద్వేలు వైపు నుంచి వచ్చిన సిమెంటు ట్యాంకర్ ఢీకొంది. ఈ సంఘటనలో కాలేజీ బస్సు బోల్తా పడి రోడ్డుపై నుంచి 20 అడుగుల మేరకు జారుకుంటూ ట్రాన్స్‌ఫార్మర్ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పడిపోయింది. సిమెంటు ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడింది. బద్వేలు నుంచి మైదుకూరుకు వస్తున్న కారు ఎడమవైపు వెళ్లడంతో ట్యాంకర్ కింద పడకుండా తప్పించుకుంది. సంఘటనలో సిమెంటు ట్యాంకర్ డ్రైవర్ సచిన్ బైస్, కాలేజీ బస్సులో ఉన్న ముగ్గురు విద్యార్థుల్లో హేమంత్ అనే విద్యార్థి, బస్సు డ్రైవర్ చిన్న నాయుడు స్వల్పంగా గాయపడ్డారు. కారులో ఉన్న డ్రైవర్ గోవిందరాజు, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని నేషనల్ హైవే అంబులెన్స్‌లో మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు. కడపకు చెందిన ఓ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న చిన్ననాయుడు ఉదయం తన ఊరు భాగ్యనగరం నుంచి బయల్దేరి కూడలిలో ముగ్గురు విద్యార్థులను ఎక్కించుకొని జీవీ సత్రం వైపు వస్తోంది. మైదుకూరుకు చెందిన కారు యజమాని ప్రసాద్‌ను బద్వేలులో వదిలి డ్రైవర్ గోవిందరాజు తన స్నేహితుడైన మరొక వ్యక్తితో కలిసి తిరిగి మైదుకూరు వస్తున్నాడు. వరదాయపల్లె ఎస్సీ కాలనీ వద్ద వెనుక వైపు నుంచి వచ్చిన సిమెంటు ట్యాంకర్ ముందు వైపు వెళుతున్న కారును, కాలేజీ బస్సును వేగంగా వచ్చి ఢీకొన్నట్టు కారు డ్రైవర్ గోవిందరాజు తెలిపారు. సంఘటనపై కాలేజీ బస్సు డ్రైవర్ చిన్ననాయుడు ఫిర్యాదు మేరకు మైదుకూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్యాంకర్ డ్రైవర్, ఒక విద్యార్థికి స్వల్ప గాయాలు


