ఇంటిపోరు ఇంతింత కాదయా...!
సాక్షి ప్రతినిధి, కడప : బోద కొట్టంలోకి ఎలుక దూరిందని వెనుకటిరోజుల్లో ఒకామె ఏకంగా ఇంటికి నిప్పు పెట్టిందనే సామెతను గుర్తు చేస్తున్నారు ఓ ఎమ్మెల్యే. అచ్చం అలాగే తన వ్యతిరేకుల్ని చేరదీస్తున్నారన్న ఆక్రోషంతో కార్పొరేషన్ పరిధిని కుదించాలని పట్టుబట్టారు. పొరుగు నియోజకవర్గ పరిధిలోని డివిజన్లను అక్కడికే మార్చాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. కార్పొరేషన్ డివిజన్లు పునర్విభజన చేపట్టాలంటూ అభ్యర్థించారు. కలెక్టర్ నివేదిక ఆచరణ సాధ్యం కాదని జవాబు వెళ్లడంతో కమిషనర్‌పై అగ్గిమీదగుగ్గిలమవుతున్నట్లు సమాచారం. అనువైన నివేదిక ఇవ్వకుండా కలెక్టర్‌ను తప్పుదారి పట్టించారని మండిపడుతన్నట్లు తెలుస్తోంది.
‘మొగుడు కొట్టినందుకు కాదు, చూసిన తోడుకోడలు నవ్వినందుకే అసలైన బాధ’అన్నట్లుగా జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి పరిస్థితి తయారైంది. తెలుగుతమ్ముళ్ల మధ్య అసంతృప్తి, అసమ్మతి అన్ని చోట్ల ఉంది. కాకపోతే, పొరుగు నియోజకవర్గానికి వెళ్లి అక్కడ అసమ్మతి గళమిప్పడమే అసలు సమస్యగా మారింది. అసమ్మతి నేతలు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో సామాజికవర్గం ఓ మారు గళమిప్పుతూ ప్రజాదృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇలా ఇప్పటికి రెండు వేర్వేరు మతాలకు చెందిన ఆధ్యాత్మిక కేంద్రాల నుంచి తరలివెళ్లారు. ఇలా వెళ్లడం తీవ్రమైన అవమానంగా సదరు ప్రజాప్రతినిధి భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పొరుగు నియోజకవర్గ నేత పెత్తనాన్ని కట్టడి చేసేందుకు అడుగులు వేసినట్లు సమాచారం.
డివిజన్లు డీలిమేటేషన్ చేయాంటూ అభ్యర్థన...
కడప కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. అందులో 6 డివిజన్లు కమలాపురం నియోజకవర్గ పరిధిలోకి రానున్నాయి. కడప మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసినప్పుడు చింతకొమ్మదిన్నె, చెన్నూరు మండలాల్లోని కొన్ని పంచాయతీలు కార్పొరేషన్‌లో విలీనం చేశారు. ఆ కారణంగా కార్పొరేషన్‌లో కమలాపురం ప్రాంతం ప్రమేయం ఏర్పడింది. ఇటీవల కడపలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో డివిజన్ల డీలిమిటేషన్ చేయాలంటూ ఓ ప్రజాప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఆమేరకు ప్రభుత్వం కలెక్టర్ నివేదిక కోరింది. సాధ్యాసాధ్యాలపై కలెక్టర్ కార్పొరేషన్ యంత్రాంగంతో చర్చించినట్లు సమాచారం. తదనంతరం డివిజన్ల పునర్విభజన సాధ్యం కాదని తెలియజేసినట్లు సమాచారం. ఆమేరకు నివేదిక అందించినట్లు తెలుస్తోంది.
కమిషనర్‌పై గరంగరం..
కార్పొరేషన్ నుంచి 6 డివిజన్లు తప్పిస్తే కమలాపురం నేతల బెడద లేకుండా పోతుందని భావిస్తుంటే, కమిషనర్ అందుకు సహకరించలేదని ఓ ఎమ్మెల్యే ఆక్రోషం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగ ధర్మాన్ని సైతం విస్మరించి అనేక ఘటనల్లో అండగా నిలిచిన అధికారి సైతం తాజాగా తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్థానంలో మరో అధికారిని తీసుకురావాలనే యోచనలో ఉన్న ట్లు సమాచారం. సందట్లో సడేమియాలాగా, పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు కొందరు మెప్మాలో పని చేస్తున్న ఓ అధికారితో అంతర్గత మంతనాలు చేసుకొని ఆయన అయితే సమర్థుడని పేరు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడా తతంగమంతా హాట్ టా ఫిక్‌గా నగరంలో చుక్కర్లు కొట్టుతుండడం విశేషం.
అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య
అంతర్గత పోరాటం
కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన
చేయాలంటూ ఓ ఎమ్మెల్యే అభ్యర్థన
కడప నియోజకవర్గ పరిధిని మాత్రమే కార్పొరేషన్‌గా కొనసాగించాలని ఒత్తిడి
కలెక్టర్ వివరణ కోరినా ప్రభుత్వం.. సాధ్యం కాదంటున్న అధికారులు


