
వాటా కోసం.. తమ్ముళ్ల కుమ్ములాట
ఓబులవారిపల్లె : టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న సంస్థకు ఖనిజం సరఫరా చేసే విషయంలో వాటా కోసం తమ్ముళ్ల మధ్య కుమ్ములాట మొదలైంది. 25 శాతం వాటా తమకే ఇవ్వాలంటూ స్థానిక టీడీపీ నాయకులు భీష్మించడంతో వాదోపవాదాలు జరిగాయి. బేరసారాలు బెడిసికొట్టడంతో టెండర్ దక్కించుకున్న కంపెనీ చివరికి సరఫరా నిలిపివేసింది. వివరాల్లోకి వెళ్తే..
మంగంపేట ఏపీఎండీసీ గనుల నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల ఏపీ ఎండీసీ నుంచి ఖనిజాన్ని కొనేందుకు బల్క్ టెండర్ ద్వారా ఎంప్రదా కంపెనీ దక్కించుకుంది. ఎపీఎండీసీ కంపెనీ ఖనిజాన్ని తరలించాల్సి ఉంది. దీనిపై కూటమి నాయకుల కన్ను పడింది. పెద్ద ఎత్తున తామే ఖనిజం తీయిస్తామని గతంలో ఒప్పందం చేసుకున్నారు. రోజూ దాదాపు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల మేర సరఫరా చేస్తున్నారు. అయితే ఇటీవల స్థానిక టీడీపీ నాయకుడు 25 శాతం ఖనిజం తీసేందుకు తమ యంత్రాలకు అవకాశం ఇవ్వాలని పటుబట్టారు. అంతకుముందు తరలిస్తున్న కూటమి నాయకులు దీనికి ఒప్పుకోకపోగా.. వాగ్వాదాం జరగడంతో వివాదం ముదిరింది. దీంతో దీనిపై శుక్రవారం ఉదయం నుంచి కూటమి నాయకుల మధ్య చర్చలు జరిగాయి. బేరసారాలు కుదరక పోవడంతో చివరకు ఏపీఎండీసీ నుంచి ఎమ్‌ప్రదా కంపెనీకి బైరెటీస్ ఖనిజం సరఫరా నిలిపివేశారు. ఏపీఎండీసీ గనుల నుంచి స్థానిక నిర్వాసిత కుటుంబీకులు, ఇల్లు కోల్పోయిన వారంతా లక్షల రూపాయలు అప్పుచేసి యంత్రాలు కొనుగోలు చేశారు. 51 ఇటాచీలు పెట్టి ఖనిజం తీస్తూ జీవనం సాగిస్తున్నారు. కూటమి నాయకులు తమకే వాటా కావాలనడంతో వీరి మధ్య వివాదం వారి జీవన స్థితిగతులకు అంటకంగా మారింది. కంపెనీకి ఖనిజం రవాణా చేసేలా చూడాలని యంత్రాల యజమానులు కోరుతున్నారు.
సీఎండీ గ్రేడ్ ఖనిజం సరఫరాలో
బెడిసిన ఒప్పందం
తమకే 25 శాతం ఇవ్వాలని స్థానిక టీడీపీ నేతల పట్టు