
రిమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్సలు
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో గైనకాలజీ విభాగంలో అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ కెఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
● 13 ఏళ్ల బాలిక ముట్టు సమస్యతో గైనకాలజీ విభాగంలో చేరారు. పరీక్షించగా తనకు అరుదైన జన్యువ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి ఎడమవైపు హెర్నియాలో ఉన్న అండాశయాన్ని, ఎడమ వైపు ఉన్న గర్భసంచి సగభాగాన్ని తొలగించారు. ప్రపంచంలో ఇటువంటి కేసులు ఇప్పటి వరకు ఐదు మాత్రమే నమోదు అయ్యాయని సూపరింటెండెంట్ తెలిపారు.
● 46 ఏళ్ల మహిళ కడుపు ఉబ్బరంతో బాధ పడుతూ అడ్మిట్ అయ్యారు. పరీక్షలు చేశాక అండాశయంలో పెద్ద కణితిని గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి 8 కేజీల కణితిని తొలగించారు.
● 55 ఏళ్ల మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ అడ్మిట్ అయ్యారు. పరీక్షలు జరిపాక అండాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చేసి 6 కేజీల క్యాన్సర్ గడ్డతోపాటు స్టేజింగ్ లాపారోటమీ అనే చికిత్స చేసి క్యాన్సర్ భాగాలను తొలగించారు.
● శస్త్ర చికిత్స చేశాక ముగ్గురు పేషెంట్స్ బాగా కోలుకున్నారని, అందరినీ డిశ్చార్జ్ త్వరలో చేస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. అన్నీ శస్త్ర చికిత్సలు గైనకాలజీ హెచ్‌ఓడి డాక్టర్ లక్ష్మీసుశీల ఆధ్వర్యంలో డాక్టర్ అమానుల్లా, క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణుల నేతృత్వంలో చేసినట్లు పేర్కొన్నారు. గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీలిమ, డాక్టర్ పద్మావతి, డాక్టర్ రబ్బాని బేగం, డాక్టర్ రేఖారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పీజీ వైద్యులు, స్టాఫ్ నర్స్‌లు పాల్గొన్నట్లు తెలిపారు. అనస్థీసియా విభాగాధిపతి డాక్టర్ సునీల్ చిరువెళ్ల, అసోసియేట్ ప్రొఫెసర్స్ డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ మంజు శృతి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పాల్గొన్నారు.