
కడపకు వచ్చారో..!
సాక్షి ప్రతినిధి, కడప : ‘రిమ్స్‌లో ఏం చేసినా మేమే చేయాలి.. మా మనుషుల ద్వారానే చేపట్టాలి. తిరుపతి నుంచి వచ్చి మీరు ఇక్కడ కొనసాగిస్తామంటే చూస్తూ ఊరుకోవాలా. ఇక్కడ మేం లేమా? టెండర్ వేసేటప్పుడు కనీసం సంప్రదించేది లేదా? ఇష్టానుసారం టెండర్లు వేస్తే మీకు స్వాగతం చెప్పాలా? గౌరవంగా చెబుతున్నాం, మీరు కడపకు రావొద్దు..’ జిల్లా టీడీపీ ముఖ్యనేత చేసిన హెచ్చరికలు ఇవి. అధికారం అండతో ఈగల్ హంట్ ప్రతినిఽధిపై రెచ్చిపోయిన వైనమిది.
కడప రిమ్స్‌లో ఇప్పటివరకూ ఎక్స్‌ఫర్ట్ ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ సర్వీసు అందుతోంది. కాలపరిమితి పూర్తి కావడంతో టెండర్లు ప్రక్రియ చేపట్టారు. ఈ మేరకు రిమ్స్‌లో సెక్యూరిటీ సర్వీసు అందించేందుకు న్యూడిల్లీకి చెందిన ఈగల్ హంట్ ఏజెన్సీ కొత్తగా టెండర్లు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈగల్ హంట్ ఏజెన్సీ ప్రతినిధి తిరుపతికి చెందిన వ్యక్తికి టీడీపీ ముఖ్యనేత నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వెళ్లాయి. తమకు తెలియకుండా సెక్యూరిటీ సర్వీసు నిర్వహణకు వచ్చావో..నీకుంటుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. బెదిరింపుల పర్వం నడుస్తుండగానే టెండర్లు పూర్తి అయ్యాయి. ఆ సెక్యూరిటీ సర్వీసులు తమ వర్గీయుడు ద్వారానే కొనసాగించాలంటూ ప్రజాప్రతినిధి కూడ ఫోన్ చేసి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ‘మీరు టీటీడీ ఉద్యోగి, మాతో పెట్టుకొవద్దు అనవసర కాంప్లీగేషన్స్ లేకుండా సెక్యూరిటీ సర్వీసు అప్పగించా..’ లంటూ ఫోన్లలో టీడీపీ ముఖ్యనేత, ప్రజాప్రతినిధి ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికీ కొలిక్కి రాకపోవడంతో వాడెలా నిర్వహిస్తాడో చూద్దామంటూ భీష్మించుకున్నట్లు సమాచారం.
శానిటేషన్ ప్రక్రియపై కూడా...
రిమ్స్‌లో ఇదివరకూ ఏ–1 ఏజెన్సీ శానిటేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈమారు టెండర్లలో ఎవరు పాల్గొనకుండా జిల్లా టీడీపీ ముఖ్యనేత మంతనాలతోపాటు, వర్గీయుల బెదిరింపులు తెరపైకి వచ్చాయి. ఇక ఎవరూ టెండర్లల్లో పాల్గొనరనే క్రమంలో తిరుపతికి చెందిన పద్మావతి ఫెస్ట్ కంట్రోల్ ఏజెన్సీ పాల్గొని టెండర్ దక్కించుకంది. టెండర్ బిడ్ ఓపెన్‌లో ఎల్–1గా నిలిచింది. ఫైనాన్స్ బిడ్ అనుమతి దక్కాల్సి ఉంది. ఈదశలో ‘కడపకు వచ్చి మీరు ఎలా కొనసాగిస్తా’రంటూ జిల్లా టీడీపీ ముఖ్యనేత నుంచి ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పెట్టింది, అధికారికంగా పాల్గొన్నాం, టెండర్ దక్కుతోంది. కచ్చితంగా కొనసాగించి తీరుతామంటూ సదరు ప్రతినిధి నుంచి జవాబు రావడంతో సదరు టీడీపీ నేత అవాక్కయినట్లు తెలుస్తోంది. సత్తా లేని వాడైతే అలా మాట్లాడరు, ఆ కాంట్రాక్టర్ ఎవరు, వారికి తెరవెనుక ఎవరున్నారో తెలుసుకోవాలంటూ అనుచరులను పురమాయించినట్లు సమాచారం. ఇంత పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడడం వెనుక అటు సెక్యూరిటీ, ఇటు శానిటేషన్ టెండర్లు ద్వారా ప్రతి నెలా రూ.59లక్షలు బిల్లింగ్ ఉండడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. కాంట్రాక్టర్ నుంచి అప్పనంగా నెలనెలా కప్పం లభిస్తుండడంతో టీడీపీ ముఖ్యనేత రంకెలు వేస్తున్నట్లు సమాచారం. కాగా పద్మావతి ఫెస్ట్ కంట్రోల్ ఏజెన్సీ ఈ వ్యవహారాన్ని సీఎంఓ దృష్టికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఫైనాన్స్ బిడ్ అప్రూవల్ రాగానే, సీఎంఓ ద్వారా రిమ్స్ అధికారులకు సిఫార్సులు చేయించుకొని కడపకు రానున్నట్లు తెలుస్తోంది.
ఈగల్ హంట్ ప్రతినిధులకు
టీడీపీ ముఖ్యనేత బెదిరింపులు
రిమ్స్‌లో మేము చెప్పినట్లే
నడుచుకోవాలి
మావాడితోనే సెక్యూరిటీ
టెండర్ కొనసాగించాలి
అధికారం అండతో బెదిరింపులకు
పాల్పడుతున్న వైనం