
అద్దె బడి మాకొద్దు
పీటీఎం ఆత్మీయ సమావేశంలో
తల్లిదండ్రుల ఆందోళన
బద్వేలు అర్బన్ : శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్న ఈ అద్దె బడి తమకొద్దని, తమ పిల్లలకు తక్షణమే సొంత పాఠశాల భవనం నిర్మించాలని చెన్నంపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో గురువారం నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె గ్రామంలో 1958లో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేశారు. 30 ఏళ్ల క్రితం బద్వేలు – మైదుకూరు రహదారిలోని చెన్నంపల్లె వద్ద పాఠశాల భవనం నిర్మించారు. ఈ పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉండగా ఐదు మంది ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. బద్వేలు పట్టణంలో జరుగుతున్న ఎన్‌హెచ్–67 రోడ్డు విస్తరణ పనులు, బైపాస్ రోడ్డు పనులు చెన్నంపల్లె ప్రాథమిక పాఠశాలకు శాపంగా మారాయి. నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా పాఠశాల గదులను కూల్చివేయాల్సి వచ్చింది. దీంతో గ్రామంలోని ఓ అద్దె భవనంలో పాఠశాల కొనసాగిస్తున్నారు. పాఠశాలను తొలగించినందుకు గాను నష్టపరిహారం కింద రూ.25 లక్షలు ఎంపీడీఓ అకౌంట్‌కు జమ చేశారు. శిథిలావస్థకు చేరి అద్దె ఇంట్లో కొనసాగుతున్న పాఠశాలకు తమ పిల్లలను భయంభయంగా పంపలేమని, కరెంటు పోయినా, వర్షం వచ్చినా గదుల కొరతతో తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే నూతన భవనం నిర్మించాలని తల్లిదండ్రులు పట్టుబట్టారు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షామీర్‌బాష సమావేశంలో తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపుతామని హామీ ఇచ్చారు.