
రిమ్స్‌లో ‘దళారుల దందా’..!
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : దివ్యాంగుల సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్, నూతన సర్టిఫికెట్లను ఇప్పించే విషయంలో కడప రిమ్స్, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేల్, కమలాపురం, పులివెందుల ఆసుపత్రుల ఆవరణలో దళారుల దందా యథేచ్చగా జరుగుతోంది. కడప సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో తమకు తాము దళారాలు సర్టిఫికెట్‌కు ఓ రేటు ఫిక్స్ చేశారు. దివ్యాంగుల నుంచి రూ.30,000 వసూలు చేసి.. ఆస్పత్రిలో పనిచేస్తున్న మీడియేటర్ ఉద్యోగికి రూ.18 వేల నుంచి 22 వేల వరకు ఇస్టున్నట్లు ఆరోపణలున్నాయి. నూతన సర్టిఫికెట్‌కు ఇదే స్థాయిలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం దొంగ, మోసపూరితమైన సర్టిఫికెట్ల ఏరివేతను కొనసాగిస్తూ జూలై, ఆగష్టు, సెప్టెంబర్ వరకు రీ వెరిఫికేషన్ ప్రక్రియ జరుపుతోంది. దివ్యాంగుల సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ కాకుండా మరో డాక్టర్ పరిశీలన చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. అధికారులు నిఘా వుంచి దివ్యాంగులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
పొలతలలో తలనీలాలకు వేలంపాట
పెండ్లిమర్రి : మండలంలోని పొలతల మల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాల వేలం ఈఓ క్రిష్ణానాయక్ బుధవారం నిర్వహించారు. 59.250 కిలోల తలనీలాలను ఒంగోలుకు చెందిన యాదగిరి రూ.5,05,500కు వేలం పాడి దక్కించుకున్నారు. దీంతోపాటు గంగనపల్లె, తిప్పిరెడ్డిపల్లె, కొత్తగిరియంపల్లెలో మల్లేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన 15.48 ఎకరాల భూమిని మూడేళ్ల కౌలుకు వేలం వేయగా రూ.18,400 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావాలి
మదనపల్లె రూరల్ : ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకువచ్చేందుకు జైలు సిబ్బంది కృషి చేయాలని జైళ్ల శాఖ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ అంజనీకుమార్ అన్నారు. మదనపల్లె సబ్ జైలు, డీఎస్పీ మహేంద్రతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ఖైదీలతో ప్రత్యేకంగా మాట్లాడి జైలులో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. జైలు గదులు, మరుగుదొడ్లు పరిశీలించి, మూడు నెలలకు పైగా జైలులో ఉన్న ఖైదీల వివరాలు, బెయిల్ మంజూరైనా, బయటకు వెళ్లని ఖైదీల సమాచారం, ఉచిత న్యాయసేవలపై జైలర్ లక్ష్మణరావును అడిగి తెలుసుకున్నారు. సీఐ ఎరీషావలీ, ఎస్‌ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు.
ఒక్కో సర్టిఫికెట్‌కు రూ. 30,000 వసూలు

రిమ్స్‌లో ‘దళారుల దందా’..!