చదువులకు మార్గం.. సార్వత్రిక విద్యా పీఠం | - | Sakshi
Sakshi News home page

చదువులకు మార్గం.. సార్వత్రిక విద్యా పీఠం

Jun 13 2025 5:19 AM | Updated on Jun 13 2025 5:19 AM

చదువు

చదువులకు మార్గం.. సార్వత్రిక విద్యా పీఠం

రాజంపేట టౌన్‌ : చదువుకోవాలన్న ఆసక్తి ఉండి కుటుంబ పరిస్థితులు అనుకూలించక నిత్యం, స్కూల్‌ లేక కళాశాలకు వెళ్లలేని వారికి ఓపెన్‌ స్కూల్‌ బాసటగా నిలుస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నామమాత్రపు ఫీజుతో ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా (ఏపీ ఓపెన్‌ స్కూల్‌) రాష్ట్ర ప్రభుత్వం దూర విద్యను అందిస్తుంది. రెగ్యులర్‌ చదువుతో సమానమైన ఈ కోర్సుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు చదువుకునేందుకు అర్హులే. రెగ్యులర్‌గా చదివి టెన్త్‌, ఇంటర్‌ ఫెయిల్‌ అయిన వారు, చదువు మధ్యలో నిలిపేసిన వారు, తక్కువ విద్యార్హతతో ఏళ్ల తరబడి చిరుద్యోగం చేస్తున్న వారు, వ్యాపారులు, గృహిణులు, ప్రజా ప్రతినిధులు ఇలా ఎవరైనా ఓపెన్‌ స్కూల్‌లో చేరవచ్చు. గతంలో ఈ విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేది. ప్రస్తుతం సమీపంలోని ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాల్లో చదువుకోవచ్చు.

నోటిఫికేషన్‌ విడుదల..

2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్‌ స్కూల్‌ ద్వారా టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల వారు ఈ ఏడాది జూలై 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్‌లో ప్రవేశానికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి చదివి వుంటే రికార్డు షీటు, ఆరవ తరగతి నుంచి ఆపై చదివి వుంటే టీసీ, టెన్త్‌ ఫెయిల్‌ అయివుంటే టీసీతో పాటు ఫెయిల్‌ అయిన మార్కుల మెమో కలిగి వుండాలి. ఇక ఏమీ చదవకుండా ఉంటే సంబంధిత అధికారులు జారీ చేసే జనన ధృవీకరణ పత్రం కలిగివుంటే టెన్త్‌లో ప్రవేశానికి అర్హులవుతారు. టెన్త్‌లో ఐదు సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా హిందీని తీసుకోవచ్చు. ఇక టెన్త్‌ ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్‌లో చేరేందుకు అర్హులు. ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూపు తీసుకున్నా ఐదు సబ్జెక్టులు చదవాల్సి వుంటుంది.

రెగ్యులర్‌ సర్టిఫికెట్‌లతో సమానం..

ఓపెన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌కు రెగ్యులర్‌ విద్యార్థుల సర్టిఫికెట్‌తో తత్సమానంగా ప్రాధాన్యత ఉంటుందో ఉండదో అని చాలా మందిలో అపోహ వుంది. అయితే అది అవాస్తవం. ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ జారీ చేసే ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సాధారణ పాఠశాల విద్య, కళాశాల విద్య సర్టిఫికెట్లతో సమానం. ఉన్నత చదువులు చదువుకునేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

జిల్లాలో 41 స్టడీ సెంటర్లు..

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో టెన్త్‌, ఇంటర్మీడియట్‌కు సంబంధించి 41 కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో స్టడీ సెంటర్‌లో టెన్త్‌లో 100 సీట్ల చొప్పున ఉంటాయి. అలాగే ఇంటర్‌లో నాన్‌ సైన్స్‌ గ్రూపులకు సంబంధించి 40 సీట్లు, సైన్స్‌ గ్రూపులకు సంబంధించి 100 సీట్లు ఉంటాయి. అడ్మిషనన్‌ పొందిన వారికి ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఉచితంగా పుస్తకాలు ఇస్తుంది. ప్రతి ఆదివారం, రెండవ శనివారం వంటి సెలవు రోజుల్లో తరగతులను నిర్వహిస్తారు. దాదాపు 30 కాంట్రాక్టు తరగతులను నిర్వహిస్తారు. ఇందులో 24 కాంట్రాక్టు తరగతులకు హాజరైన వారికి మాత్రమే పబ్లిక్‌ పరీక్షక్ష రాసేందుకు అనుమతి ఉంటుంది. విద్యార్థులు వెంటనే ఉత్తీర్ణులు కాకుంటే ఐదు సంవత్సరాల్లో తొమ్మిది మార్లు పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావచ్చు.

ఇంటర్‌లో సైన్స్‌, ఆర్ట్స్‌ గ్రూపులు..

ఇంటర్మీడియట్‌లో సైన్స్‌, ఆర్ట్స్‌ గ్రూపులు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ, ఎంబైపీసీ గ్రూపులు ఉంటాయి. ఇందులో విద్యార్థులు తమకు నచ్చిన గ్రూపులో చేరవచ్చు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ, ఒరియా మీడియంలు ఉన్నాయి. వీటిలో విద్యార్థులు తమకు నచ్చిన మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. ఇంటర్మీడియట్‌లో ఐదు సబ్జెక్టులు ఉంటాయి. టెన్త్‌ ఉత్తీర్ణులైన సంవత్సరంలోనే ఇంటర్‌ చేరితే ఇంటర్మీడియట్‌లో నాలుగు సబ్జెక్ట్‌లు మాత్రమే పరీక్ష రాసుకోవాల్సి వుంటుంది. ఆ తరువాత ఏడాది మరొక సబ్జెక్ట్‌ రాసుకోవాల్సి వుంటుంది. టెన్త్‌ ఉత్తీర్ణులైన తరువాత ఒక ఏడాది గ్యాప్‌ ఉంటే ఐదు సబ్జెక్ట్‌లు ఒకేసారి రాసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ :30–7–2025

200 రూపాయల అపరాధ రుసుముతో 1–8–2025 నుంచి 15–8–2025 వరకు ప్రవేశం పొందవచ్చు.

ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

వయసుతో సంబంధం లేకుండా

చదువుకునేందుకు అందరూ అర్హులే

టెన్త్‌, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలకు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

కొత్త స్టడీ సెంటర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు..

ఈ ఏడాది కొత్తగా ఓపెన్‌ స్కూల్‌ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి గల ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వివిధ కారణాల రీత్యా రెగ్యులర్‌గా టెన్త్‌, ఇంటర్మీడియట్‌ చదవలేని వారికి ఓపెన్‌ స్కూల్‌ ద్వారా టెన్త్‌, ఇంటర్మీడియట్‌ను పూర్తి చేసుకోవడానికి ఇది చాలా చక్కటి అవకాశం. ఈ ఉత్తీర్ణత సర్టిఫికెట్లకు ప్రభుత్వ గుర్తింపు వుంది. అందువల్ల ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడతాయి.

– కొండూరు శ్రీనివాసరాజు, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌

చదువులకు మార్గం.. సార్వత్రిక విద్యా పీఠం1
1/2

చదువులకు మార్గం.. సార్వత్రిక విద్యా పీఠం

చదువులకు మార్గం.. సార్వత్రిక విద్యా పీఠం2
2/2

చదువులకు మార్గం.. సార్వత్రిక విద్యా పీఠం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement