నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత

May 22 2025 12:21 AM | Updated on May 22 2025 12:21 AM

నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత

నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత

కడప సెవెన్‌రోడ్స్‌: వర్షాలు సంవృద్ధిగా కురిసే వరకు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముత్యాల రామగోవిందరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుణ్యక్షేత్రమైన గండిలో లక్ష లీటర్ల సామర్థ్యంతో నీటిట్యాంకు నిర్మించేందుకు జెడ్పీ నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేస్తామని, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అంచనా వ్యయాలు రూపొందించి సమర్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈకి సూచించారు. కాశినాయన మండల జెడ్పీటీసీ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ తన స్వగ్రామమైన నాయనిపల్లెలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎర్రగుంట్ల జెడ్పీటీసీ బాలయ్య మాట్లాడుతూ వలసపల్లె గ్రామంలో మూడేళ్లుగా తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిమెంట్‌ యాజమాన్యం తవ్వకాలు చేపట్టడం వల్ల భూగర్భజలాలు లేకుండా పోయాయన్నారు. చిలంకూరు–ఉప్పలూరు రోడ్డు అధ్వానంగా ఉందని, మరమ్మతులు చేయించాలని కోరారు.

● జెడ్పీ చైర్మన్‌రామగోవిందరెడ్డి మాట్లాడుతూ రాజంపేట బస్టాండులో టాయిలెట్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించి ఇవ్వాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈకి సూచించారు. బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లె చెరువు వద్దకు ఇటీవల ఈతకు వెళ్లి మృతి చెందిన పిల్లల కుటుంబాలకు కాంట్రాక్టర్‌ నుంచి పరిహారం ఇప్పించే విధంగా కలెక్టర్‌తో మాట్లాడాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా అనేక ఏళ్ల నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 60 మందిని తొలగించడం అన్యాయమన్నారు. ఏ కారణంతో వారిని తొలగించారో చెప్పాలని డ్వామా అధికారులను ఆయన ప్రశ్నించారు. చిన్నచిన్న తప్పులు చేసిన వారినంతా తొలగించుకుంటూపోతే డ్వామా లో ఒక్కరూ కూడా మిగలరన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎక్స్‌రే ప్లాంట్లు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచడం మాత్రమే కాదని, వాటి నిర్వహణకు తగిన సిబ్బంది ఉండేలా చూడాలన్నారు. ఎస్సీ,ఎస్టీల ఇళ్లకు ఉచితంగా సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. నాడు–నేడు కింద జిల్లాలోని పాఠశాలల మరమ్మతు పనులు చేపడతామన్నారు. జెడ్పీ సమావేశాలకు హాజరు కాని అధికారులకు కలెక్టర్‌ ద్వారా షోకాజ్‌ నోటీసులు జారీ చేసేలా చూడాలని జెడ్పీ సీఈఓను కోరారు. జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షులు పిట్టు బాలయ్య మాట్లాడుతూ జూన్‌లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్నందువల్ల రైతులకు నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు సకాలంలో సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండ్లిమర్రి మండలం యల్లటూరు రోడ్డుపై చిన్న వర్షానికే నీరు నిలబడుతోందని, రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు.

పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్‌ మాట్లాడుతూ 50 ఏళ్లు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు పెన్షన్‌ మంజూరు చేస్తామంటున్న ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిందా? అంటూ ప్రశ్నించారు. మైదుకూరు నియోజకవర్గంలో 25 స్మశాన వాటికల పనుల కోసం ఉపాధి హామి నిధులను వినియోగించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నారని, మిగతా ప్రాంతాలకు కూడా ఇలాంటి అవకాశం కల్పించాలని కోరారు. వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌ రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యులు కరీముల్లా తదితరులుమాట్లాడారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మతోపాటు పలువురు జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

60 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్ల తొలగింపు అన్యాయం

నాడు–నేడు కింద పాఠశాలలమరమ్మతు పనులు

జెడ్పీ చైర్మన్‌ ముత్యాల రామగోవిందరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement