
వాసువి చిల్లర రాజకీయాలు
● ఆయనవి ‘మార్ఫింగ్’ రాజకీయం
● నువ్వు నన్నేమీ చేయలేవు
● టీడీపీ సీనియర్ నేత లక్ష్మీరెడ్డి ధ్వజం
కడప రూరల్: తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఆలంఖాన్‌పల్లె లక్ష్మీరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్ట్ పనులు చేస్తూ అంకెలను ‘మార్ఫింగ్’ చేయడంలో శ్రీనివాసులురెడ్డిపై దిట్ట అని విమర్శనాస్త్రాలు సంధించారు. మినీ మహానాడులో తాను పార్టీకి వ్యతిరేకంగా ఏదో మాట్లాడినట్లుగా మార్ఫింగ్ చేసి వినిపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ఏనాడు పార్టీ నియమాలను ఉల్లంఘించలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో అధ్యక్షుడిగా శ్రీనివాసులురెడ్డి సహకారం లేకుండా ఆలంఖాన్‌పల్లెలో విజయకేతనం ఎగురవేశామన్నారు. తన కోడలు ఉమాదేవి కార్పొరేటర్‌గా గెలిచిందన్నారు. గత ఎన్నికల్లో శ్రీనివాసులురెడ్డి కడప పార్లమెంట్ టికెట్ నాకు, కడప ఎమ్మెల్యే సీటు మీకు అని చెప్పారన్నారు. యువ నేత నారా లోకేష్ కూడా కడప ఎమ్మెల్యే సీటును తన కోడలు ఉమాదేవికే ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఎంపీగా పోటీ చేయాలనుకున్న శ్రీనివాసులురెడ్డి కన్ను కడప ఎమ్మెల్యే స్ధానంపై పడిందని అన్నారు. ఈ విషయమై ఆయన విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజకీయం చేశారన్నారు. తాజాగా ఆయన తన కొడుకును కడప మేయర్‌గా చేయాలనే ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజాదరణ కలిగిన తాము అందుకు అడ్డుపడుతామని, వాసు తమపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ‘వాసూ..నువ్వు నన్నేమీ చేయలేవు’ అని వ్యాఖ్యానించారు. కార్పొరేటర్ ఉమాదేవి మాట్లాడు తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు కడప మినీ మహానాడులో చిల్లర రాజకీయాలు చేశారన్నారు.