
ఇక పుస్తకాలతో దోస్తీ!
కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. పుస్తకాలతో కుస్తీ షురూ అయింది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి గడువు తక్కువగా ఇవ్వడంతో అభ్యర్థుల్లో ఒత్తిడి మొదలైంది. దీనికితోడు నోటిఫికేషన్‌లో ఊహించని విధంగా మెలికలు పెట్టడంతో చాలా మంది అభ్యర్థులకు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా జనరల్ అభ్యర్థులకు 45 శాతం మార్కుల నిబంధన పెట్టి వారి ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లింది.
● ఉమ్మడి కడప జిల్లా పరిధిలో ఈ డీఎస్సీ పరీక్ష కోసం 29,915 దరఖాస్తులు రాగా.. ఇందులో 15,812 మంది అభ్యర్థులు పరీక్షను రాయనున్నారు. కొందరు రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేశారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలుపుకుని 705 పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెల 20 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ పూర్తయింది. ఈనెల 30న హాల్‌టిక్కెట్లు విడుదల చేయనున్నారు. జూన్ 6 నుంచి పరీక్ష ప్రారంభమై జూలై 6వ తేదీ వరకు కొనసాగనుంది.
ఒక్కో పోస్టుకు 49 మంది వరకు పోటీ
అందిన దరఖాస్తుల ప్రకారం ఒక్కో పోస్టుకు 49 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఈ పోటీకి తగ్గట్టుగా పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం లేకపోవడంతో చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కొందరు కోచింగ్ సెంటర్లలో, మరి కొందరు అభ్యర్థులు ఇళ్లల్లో పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
ముగిసిన డీఎస్సీ దరఖాస్తు గడువు
ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 29,915 దరఖాస్తులు
మొత్తం 705 డీఎస్సీ పోస్టులు
ఒక్కో పోస్టుకు 49 మంది అభ్యర్థులు పోటీ
ఈనెల 15తో ముగిసిన దరఖాస్తు ప్రక్రియ
20 నుంచి మాక్‌టెస్ట్....30 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్
జూన్ 6 నుంచి నెలరోజులపాటు డీఎస్సీ నిర్వహణ
మహిళలే అత్యధికం
ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో మహిళలే అత్యధికంగా ఉన్నారు. 15812 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 9598 మంది మహిళలు ఉండగా 6214 మంది పురుషులు ఉన్నారు. కొందరు అభ్యర్థులు తమ అర్హతలను బట్టి పలు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్నారు.