
పాఠశాల భవనాలు కూల్చివేయడం దారుణం
కడప ఎడ్యుకేషన్ : కడప సీఎస్‌ఐ చర్చి వెనుక ఉన్న న్యూ మోడల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ భవనాలను ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి కూల్చి వేయించడం దారుణమని స్కూల్ కరస్పాండెంట్ షర్మిల అన్నారు. పాఠశాల ఆవరణలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ బిషప్ చెప్పినట్లు తాను నడుచుకోలేదని, కక్షపూరితంగా భవనాలను కూల్చి వేయించాడని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నమే చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీంతో తనను పిలిపించి మాట్లాడిన బిషప్ 2025–26 విద్యా సంవత్సరం వరకూ గడువిస్తున్నామని చెప్పారన్నారు. మళ్లీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి 1.40 గంటలకు బిషప్ కుమారుడు కొంతమంది మనుషులతో వచ్చి భవనాలను కూల్చివేయించారన్నారు. పాఠశాలలో 250 మంది విద్యార్థులున్నారని, 20 రోజుల్లో పాఠశాల పునఃప్రారంభించాల్సి ఉండగా.. ఇలా చేయడం సరికాదన్నారు. జూన్‌లో పిల్లలను ఎక్కడ కూర్చోబెట్టాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలిన భవనాల కింద ఫర్నిచర్, పిల్లల విద్యాసామాగ్రి ధ్వంసం అయ్యాయని, విద్యార్థుల సర్టిఫికెట్స్ ఉన్నాయన్నారు. విద్యా సంవత్సరం పూర్తయినవారు టీసీల కోసం వస్తున్నారని, వారికి ఏమివ్వాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూలు ఉందని, తాను 2020 లో తీసుకున్నానిని చెప్పారు. కరుణ, దయ, ప్రేమ అని బిషప్ చెప్పడమే తప్ప...ఆయన పాటించడం లేదన్నారు. ఉన్నతాధికారులు, మత పెద్దలు జోక్యం చేసుకుని పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పాస్టర్ కె.డి.ఐక్యతరావు మాట్లాడుతూ సీఎస్‌ఐ ఆస్తులపై బిషప్‌కు ఎలాంటి అధికారం లేదన్నారు. ఈ ఆస్తులన్నీ దక్షిణమండలి చైన్నె ఆధ్వర్యంలో ఉంటాయని, అక్రమంగా భవనాలు నిర్మిస్తూ ఉంటే కోర్టుకు వెళ్లి ఆపి వేయించామని చెప్పారు. ఈ సమావేశంలో స్కూల్ డైరెక్టర్లు మనోజ్, ప్రధానోపాధ్యాయుడు ధీరజ్ పాల్గొన్నారు.
శిథిల గదులను కూల్చేశాం
కడప సీఎస్‌ఐ ప్రాంగణంలోని శిథిల భవనాలను కూల్చివేశామని రాయలసీమ డయాసిస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. డయాసిస్ బోర్డింగ్ హాస్టల్ గదుల సముదాయం వందేళ్ల కిందట పెంకులతో నిర్మించారని, శిథిలమవడంతో కూల్చివేశామని తెలిపారు. ఇక్కడ ఉన్న శ్రీన్యూ మోడల్ స్కూల్ఙ్‌కు 2022 వరకు అనుమతిచ్చారని, అప్పటి నుంచి ఖాళీ చేయమని పలుమార్లు చెప్పినా కాలయాపన చేస్తు వచ్చారన్నారు. పాత గదుల్లో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరుగుతుందని భావించి కూల్చివేశామని తెలిపారు. స్కూల్ యజమాన్యానికి ఎలాంటి అగ్రిమెంట్, హక్కులు లేవన్నారు. కొందరు డయాసిస్ ప్రతిష్ట భంగం చేస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
న్యూ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
కరస్పాండెంట్ షర్మిల

పాఠశాల భవనాలు కూల్చివేయడం దారుణం