
పోక్సో యాక్ట్ కేసులో యువకుడు అరెస్ట్
కడప అర్బన్ : పోక్సో కేసులో కుమారుడిని అరెస్టు చేయడంతో తల్లి విష ద్రావణం తాగి అస్వస్థతకు గురైన సంఘటన కడప నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తమకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ వారి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వివరాల మేరకు.. కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామరాజుపల్లికి చెందిన విజయ్(22) మంగళవారం తెల్లవారుజామున తన కుమార్తె(17)కు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని హరిజనవాడకు చెందిన జయమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రెడ్డెప్ప, ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సాయంత్రం నిందితుడు విజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితుడి తల్లి ఆత్మహత్యాయత్నం
పోక్సో యాక్టు కేసులో కుమారుడు విజయ్ అరెస్టు కావడంతో అతడి తల్లి నాగరాణి, సోదరి రూప, బంధువులు, స్నేహితులు మంగళవారం కడప తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమయంలో తన వెంట తెచ్చుకున్న విష ద్రావణం నాగరాణి, రూప తాగారు. అస్వస్థతకు గురి కావడంతో పోలీసులు అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. రూపను మరికొంతసేపటికి తమ వెంట బంధువులు తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు, నిందితుడి బంధువులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు తమకు అన్యాయం చేశారని, రాజీ చేస్తామని చెప్పి చివరకు విజయ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారనిఆరోపించారు.
చట్ట ప్రకారమే చర్యలు: సీఐ
తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామరాజుపల్లెకు చెందిన జయమణి తన కుమార్తెను విజయ్ మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్లినట్లు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని చట్ట ప్రకారమే అరెస్ట్ చేశామన్నారు. కేసు, అరెస్ట్‌ల గురించి నిందితుడి బంధువులకు స్పష్టంగా తెలియజేశామన్నారు. అనవసరంగా ఆందోళన చేశారన్నారు.
విష ద్రావణం తాగి తల్లి ఆత్మహత్యాయత్నం
పోలీస్‌స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన

పోక్సో యాక్ట్ కేసులో యువకుడు అరెస్ట్