
వడ్డీ కట్టలేదని.. ఇంటి నుంచి గెంటేశారు
వృద్ధ మహిళపై వ్యాపారుల దాష్టీకం
కడప అర్బన్ : పక్షవాతంతో బాధపడుతున్న మహిళపై కారుణ్యం చూపకుండా.. వడ్డీ వ్యాపారులు కర్కశంగా వ్యవహరించారు. తమ భర్త చేసిన అప్పు కట్టలేదనే నెపంతో ఇంటికి తాళం వేసి వృద్ధురాలు, ఆమె కుమార్తెను బయటికి నెట్టేశారు. ఎండ, వానకు ఇద్దరూ బిక్కుమంటూ బయటే ఉండాల్సి వచ్చింది.. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివానందపురంలో భూమన పిచ్చమ్మ, ఆమె కుమార్తె వెంకటసుబ్బమ్మ నివాసముంటున్నారు. స్థానిక వడ్డీ వ్యాపారులు బాలగురవయ్య, అతడి కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా వచ్చి.. డబ్బు కట్టలేదంటూ పిచ్చమ్మ, వెంకటసుబ్బమ్మలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇంటికి తాళం వేసి.. సామాన్లు బయటపడేసి వెళ్లిపోయారు. దీంతో ఆదివారం నుంచి తల్లి, కుమార్తె ఇంటి ఎదుటే బిక్కు మంటూ ఉండిపోయారు. పిచ్చమ్మ మాట్లాడుతూ తన మనుమరాలు వివాహం సమయంలో బాలగురవయ్య వద్ద రూ.4 లక్షలు అప్పు తీసుకున్నారని, ఆ సొమ్ము చెల్లించలేదని తమ రెండున్నర సెంట్ల స్థలంలో ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకున్నారన్నారు. డాక్యుమెంట్లలో సంతకాలు చేయించుకుని దౌర్జన్యంగా బయటకు తోసి వెళ్లిపోయారని బోరున విలపించారు. తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీపీఐ నిరసన
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : మహిళలను ఇంటినుంచి గెంటేసిన బాలగురవయ్య, వారి కుమారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ, ఆర్‌సీపీ నాయకులు ప్రసాద్ డిమాండ్ చేశారు. బాధితుల ఇంటి ఎదుట బైఠాయించి మంగళవారం నిరసన తెలిపారు. పిచ్చమ్మకు చెరందిన ఐదు సెంట్ల స్థలాన్ని కాజేసేందుకు బాలగురయ్య కుట్ర చేశారని, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బాల గురవయ్య, మురళి, బాలచంద్ర, బాలుడు, ఓబులేసు, ఓబుళపతి, లక్ష్మీదేవి, బాలమ్మ తదితరులు ఇంట్లోకి చొరబడి పిచ్చమ్మపై దాడి చేశారన్నారు. మూడు బంగారు ఉంగరాలు, రూ.16 వేల నగదు, ఇతర సామగ్రి కాజేశారన్నారు. వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ మహిళలు బిక్కుమంటున్నారని వాపోయారు. ఇరువురి బాధితులకు న్యాయం జరిగేంతవరకూ ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఆర్‌సీపీ నాయకులు మల్లికార్జున, భాగ్యలక్ష్మి, విజయ్, రమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.