
15 మందికి జైలు శిక్ష
బద్వేలు అర్బన్ : డ్రంకెన్ డ్రైవ్, మట్కా, కేసుల్లో పట్టుబడిన 15 మందికి బద్వేల్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముకేష్‌కుమార్ గురువారం జైలుశిక్ష విధించారు. బద్వేల్ అర్బన్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఒకరికి ఏడు రోజులు, మరొకరికి 10 రోజుల జైలుశిక్ష, గ్యాంబ్లింగ్, మట్కా కేసుల్లో పట్టుబడిన 13 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై నిరంతరం తనిఖీలు, మట్కా, గ్యాంబ్లింగ్‌పై దాడులు కొనసాగుతాయన్నారు.
చంటి హత్యపై డీఎస్పీ ఆరా
చక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం కోమటిపేటకు చెందిన చంటి హత్యపై డీఎస్పీ మురళీ నాయక్ శుక్రవారం ఆరా తీశారు. దేవరగుట్టపల్లె సమీపంలో దుండగులు చంటిపై దాడి చేసి పడేసి వెళ్లిన విషయం తెలిసిందే. హత్య జరిగిన స్థలాన్ని ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్యతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. హత్యకు గల కారణాలు, కారకులను గుర్తించి కేసు త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.
మృతదేహం లభ్యం
కలసపాడు : మండల కేంద్రమైన కలసపాడు ఆర్సీఎం చర్చి వెనుక భాగాన తెలుగుగంగ కాల్వలో గుర్తు తెలియని మృతదేహం గురువారం లభ్యమైంది. అటుగా వెళుతున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ తిమోతిలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 60–65 సంవత్సరాల మధ్య ఉంటుందని, వారం రోజుల కిందట మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మోహినీ అలంకారంలో
వేంకటేశ్వరుడు
జమ్మలమడుగు : నారాపురస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా వేంకటేశ్వరుడు భక్తులకు మోహినీ అలంకారంలో గురువారం దర్శనమిచ్చారు. గురువారం ఉదయం వేదపండితులు స్వామికి ప్రత్యేక పూజలు జరిపి మోహినీ రూపంలో అలంకరించారు. అనంతరం స్వామిని వాహనంపై కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు కీర్తనలు పాడుతూ, కోలాటం ఆడుతూ స్వామికి ఘన స్వాగతం పలికారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వేంకటేశ్వరుడి కల్యాణం జరుపనున్నారు.