హామీ ఏమైంది చినబాబూ! | - | Sakshi
Sakshi News home page

హామీ ఏమైంది చినబాబూ!

May 16 2025 12:33 AM | Updated on May 16 2025 12:33 AM

హామీ

హామీ ఏమైంది చినబాబూ!

సాక్షి ప్రతినిధి, కడప: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?అన్నట్లుగా సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్‌ వ్యవహారశైలి ఉందని విశ్లేషకులు అంటున్నారు. మాట ఇవ్వడం ఆపై మరుగునపర్చడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయంలో నారా లోకేష్‌ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలపై మంత్రి నారా లోకేష్‌ వ్యవహరించిన తీరు అలాగే ఉంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూల్చివేతలంటే ఎక్కడ తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందోనని హడావుడి చేసి.. అక్కడంతా తానే సొంత డబ్బులతో చేసేస్తానని చెప్పిన లోకేశ్‌...ఓ చిన్న కట్టడం కట్టి చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు ఆ క్షేత్రంలో సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

● కాశినాయన క్షేత్రంలో సత్రాలు, ఇతర నిర్మాణాలను కూల్చివేసేందుకు అటవీ శాఖ నడుంకట్టింది. నిర్దాక్షిణ్యంగా అక్కడి నిర్మాణాలను కూల్చివేసింది. అప్పటికే అటవీ అనుమతుల కోసం కేంద్రానికి సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసినా అనుమతులు రాలేదు. ప్రభుత్వం మారడంతో చంద్రబాబు సర్కార్‌ అక్కడ కూల్చివేతల పర్వం చేపట్టింది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయ్యింది. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూల్చివేతలపై అన్ని వర్గాల వారు నిరసన గళం విప్పారు. తమ ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనని భయపడ్డ నారా లోకేశ్‌ హడావుడి చేశారు. ఏకంగా తన పీఏను పంపించి కూల్చివేసిన నిర్మాణాలను దగ్గరుండి కట్టించి రావాలని పురమాయించారు. ఆమేరకు ప్రచార మాద్యమాలల్లో కూడా ప్రకటించారు. సొంత డబ్బులతో కూల్చివేసిన నిర్మాణాలు పునః నిర్మిస్తామని ప్రకటించారు. ఆపై పీఏ ద్వారా కాశినాయన క్షేత్రంలో ఓ 5 లక్షల రూపాయలతో స్వల్ప నిర్మాణాలు చేపట్టి వెళ్లిపోయాడు. కాగా అక్కడి వాస్తవ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది.

అటవీ అనుమతులపై హంగామాతో సరి

కాశినాయన క్షేత్రం అటవీ ప్రాంతంలో ఉంది. దానిని డీ నోటిఫై చేసి క్షేత్రానికి 13 హెక్టార్లు స్థలాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. రాష్ట్రంలో అధికార మార్పిడి రాగానే కాశినాయన క్షేత్రంలో కట్టడాలు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఇక్కడ అసలు సమస్య అటవీ అనుమతులు తీసుకురావడం. కాగా మంత్రి నారా లోకేశ్‌ మాత్రం ప్రభుత్వానికి నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు రూ.5లక్షలు ఖర్చు చేసి, అంతా చల్లారిన తర్వాత అక్కడి నుంచి చల్లగా జారుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అటవీ అనుమతుల విషయంలో మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. అప్పట్లో టీడీపీ నేతలతో పాటు బీజేపీ నేతలు పోటీ పడి మరీ పర్యటనలు చేసి అటవీ అనుమతు లు తీసుకొస్తాం అంటూ హామీలు ఇచ్చి వెళ్లా రు. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయారని పలువురు వాపోతున్నారు.

ఆర్టీసీ సర్వీసు మూన్నాళ్ల ముచ్చటే...

కాశినాయన క్షేత్రంఅటవీ అనుమతులపై చేతులెత్తేసిన నారా లోకేష్‌

రూ.5లక్షలతో కూల్చివేత చేపట్టిన వాటికి మాత్రమే పునః నిర్మాణం

ప్రజాగ్రహం నుంచి తప్పించుకునేందుకు కూటమి నేతల హంగామా

ఆపై అటవీ అనుమతుల గురించి విస్మరించిన వైనం

మంత్రి నారా లోకేశ్‌ కల్పించుకుని కాశినాయిన క్షేత్రానికి ఆర్టీసీ బస్సు వేయించాడని గొప్పలు చెప్పుకున్నారు. కాశినాయన క్షేత్రంపై చిత్తశుద్ధితో ఉన్నారని భక్తులను సైతం భ్రమింపజేశారు. కాగా కూటమి సర్కార్‌ చర్యలన్నీ ప్రచారయావతో చేసినవిగా అతి స్పల్ప కాలంలోనే తేటతెల్లమైంది. మార్చి9న కూల్చివేతలు ప్రారంభించి, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగడంతో నష్ట నివారణ చర్యలల్లో నిమగ్నమై నటించి వెళ్లారు. చివరికి ఆర్టీసీ సర్వీసు కూడా మూన్నాళ్ల ముచ్చటే అయింది. కావాల్సిన అటవీ అనుమతులు తీసుకురావడంలో మాత్రం టీడీపీ, బీజేపీ నేతలు మాట దాటేసి రాజకీయ పబ్బం గడుపుకుని వెళ్లిపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హామీ ఏమైంది చినబాబూ!1
1/1

హామీ ఏమైంది చినబాబూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement