
ఎట్టకేలకు.. ఒక హాల్టింగ్
రాజంపేట: రాష్ట్రంలో వైష్టవ క్షేత్రంగా వెలుగొందుతోంది ఒంటిమిట్ట(ఏకశిలానగరం) కోదండ రామాలయం. ఇక్కడ ఉన్న స్టేషన్‌లో ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వలేదు..ఇటీవల చర్లపల్లె–తిరుపతి (07017– 07018) నంబరు గల స్పెషల్‌ట్రైన్‌కు ఎట్టకేలకు హాల్టింగ్ ఇచ్చారు. ఒకరకంగా హాల్టింగ్‌లో కదలిక మొదలైందని చెప్పుకోవచ్చు.
● రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ముందు ఒంటిమిట్టలో దూరప్రాంతరైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని రైల్వేమంత్రిత్వశాఖను కోరారు. అలాగే ‘సాక్షి’లో రామయ్య దరిచేరేదేలా అనే శీర్షికతో అనేక మార్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఒంటిమిట్టలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వరనే నానుడి తుడిచిపెట్టుకుపోయింది.
● తిరుపతి–చర్లపల్లె మధ్య నడిచే స్పెషల్‌ట్రైన్‌కు హాల్టింగ్ ఇవ్వడంతో తెలంగాణా ప్రాంతం , కర్నూలు జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చేందుకు వీలు కలిగింది. శనివారం తిరుపతిలో 4.40 సాయంత్రం 4.40కి బయలుదేరి ఒంటిమిట్టకు 7.05 గంటలకు చేరుకుంటుంది. మరుసటిరోజు ఉదయం 7.10కి చర్లపల్లెకు చేరుకుంటుంది. ఆదివారం రాత్రి 9.45కు చర్లపల్లెలో బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 7.50కి ఒంటిమిట్ట, 10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
రెగ్యులర్ ట్రైన్స్ హాల్టింగ్
సౌకర్యం కల్పించాలి
ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ మీదుగా నడిచే రెగ్యులర్ ట్రైన్స్‌కు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రాయలసీమ, ఎంజీఆర్ చైన్నె ఎక్స్‌ప్రెస్, విశాఖ–కడప ఎక్స్‌ప్రెస్, హరిప్రియ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ఇది వరకే ఎంపీ మిథున్‌రెడ్డి రైల్వేమంత్రిత్వశాఖను తన లేఖ ద్వారా కోరారు. అయితే స్పెషల్‌ట్రైన్‌కు హాల్టింగ్ ఇచ్చారంటే..ఇక రెగ్యులర్ ట్రైన్స్‌కూడా హాల్టింగ్ ఇచ్చే అంశాన్ని రైల్వేపరిశీలనలో ఉన్నట్లు కనిపిస్తోంది. రెగ్యులర్ ట్రైన్స్ హాల్టింగ్ ప్రభుత్వం, టీటీడీ నుంచి కూడా రైల్వేశాఖపై ఒత్తిడి తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఫలించిన ఎంపీ మిథున్‌రెడ్డి కృషి
వారానికి ఒకసారి చెర్లపల్లె–తిరుపతి స్పెషల్‌ట్రైన్
ఒంటిమిట్టలో హాల్టింగ్ సౌకర్యం