
అడ్మిషన్ల గడువు పొడిగింపు
కడప ఎడ్యుకేషన్: కడప నగర శివార్లలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లు గడువును మే 19 వరకు పొడిగించినట్లు మను కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ విలయత్ అలీ బేగ్ తెలిపారు. పదో తరగతి అర్హత (రెగ్యులర్ లేక ఓపెన్ )తో ఉర్దూ మీడియం లేకపోతే ఉర్దూ సబ్జెక్ట్ చదువుకొని ఉండాలని తెలిపారు. రెండో సంవత్సరం పాలిటెక్నిక్ అడ్మిషన్ పొందాలంటే రెండేళ్ల ఐటీఐ లేకపోతే ఇంటర్మీడియట్ చదివి ఉండాలని తెలిపారు. ఇందులో ప్రవేశానికి జూన్ 13వ తేదీ మద్యాహ్నం రాత పరీక్ష కడప క్యాంపస్‌లో ఉంటుందని చెప్పారు. పరీక్షా ఆధారంగా ర్యాంకు ద్వారా సీట్ భర్తీ చేస్తామన్నారు. వివరాలకు https:// manu ucoe.in/RegularAdmissionలో తగు సమాచారం తెలిసుకోవచ్చని ఇన్‌చార్జు ప్రిన్సి పాల్ తెలిపారు. వివరాలకు కళాశాల అడ్మిషన్ కన్వీనర్ ఎం.సికందర్ హుస్సేన్ (93980 83058) ను సంప్రదించాలని సూచించారు.
బీఈడీ కళాశాల సీజ్
ప్రొద్దుటూరు: స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలోని మలయాళ స్వామి బీఈడీ కళాశాలకు సంబంధించిన 13 గదులను ఆశ్రమ నిర్వహణ అధి కారి రామచంద్రాచార్యులు గురువారం పోలీసుల సహకారంతో సీజ్ చేశారు. 2019 నుంచి మలయాళ స్వామి బీఈడీ కళాశాలకు సంబంధించి అద్దె చెల్లించడం లేదు. పలు మార్లు అధికారులు నోటీసులు జారీ చేసి కళాశాల నిర్వాహకులు పట్టించుకోలేదు. ఇప్పటికే శ్రీకృష్ణ గీతాశ్రమంలో జరుగుతున్న అవకతవకలపై పలు మార్లు సాక్షిలో కథనాలు ప్రచురించడం జరిగింది. బుధవారం ఈఓ నివేదికను ‘‘తొక్కి పెట్టింది ఎవరు’’అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు.
పీజీ ఫలితాలు విడుదల
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆచార్య పద్మ మాట్లాడుతూ ఏప్రిల్‌లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు త్వరితగతిన విడుదలకు కృషిచేసిన పరీక్షల విభాగాన్ని అభినందించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కెఎస్వీ కృష్ణారావు మాట్లాడుతూ ఎంఏ తెలుగు, హిస్టరీ, పీఎస్ అండ్ పీఏ, ఎకనామిక్స్, ఉర్దూ ఎంకాం కోర్సులలో విద్యార్థులు వంద శాతం ఫలితాలను సొంతం చేసుకున్నారని వివరించారు. ఫిజిక్స్ 90 శాతం, జువాలజి 96.97 శాతం, బయోటెక్నాలజి 97.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సీఈ వివరించారు. పరీక్షల నిర్వహణ సహాయ అధికారులు డాక్టర్ కె. శ్రీనివాసరావు, కామర్స్ సహ ఆచార్యులు డాక్టర్ జి.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.