
కోళ్ల వేస్టు.. కొల్లగొట్టు !
సాక్షి టాస్క్‌ఫోర్స్ : దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా అధికారముండగానే నాలుగు రూపాయలు పోగు చేసుకోవడానికి అధికార పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. ఇసుక దందాల్లో మునిగితేలుతున్నారు.. స్థలాల ఆక్రమణల్లో చక్రాలు తిప్పుతున్నారు... చివరికి కోళ్ల వేస్టేజీని వదలట్లేదు. అవును.. కోళ్ల వ్యర్థాలను తీసుకెళ్లే కాంట్రాక్టర్‌తో నెలకు రూ.2.10 లక్షలు చెల్లించేలా ఓ ప్రజాప్రతినిధి పీఏ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో దాదాపు 200 చికెన్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో సుమారు 50 పెద్ద చికెన్ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజు పెద్ద ఎత్తున కోళ్ల పేగులు, తలకాయలు లాంటి వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. తొలగించిన వ్యర్థాలను చేపల చెరువుల్లో ఆహారంగా వినియోగిస్తున్నారు. చాలా ఏళ్లుగా మైలవరం, జమ్మలమడుగు ప్రాంతాల్లో చేపల చెరువులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్ రోజు వీటిని చికెన్ సెంటర్ల నుంచి సేకరించి తీసుకెళ్లడం, చేపలకు ఆహారంగా వేయడం జరుగుతోంది. మినీ లారీని ఏర్పాటు చేసి 12 డ్రమ్ముల్లో రోజు ఉదయాన్నే చికెన్ సెంటర్ల నుంచి వ్యర్థాలను తరలిస్తున్నారు. కోళ్ల వ్యర్థాలు పేరుకుపోతే తమకు ఇబ్బందులు ఎదురవుతాయన్న కారణంతో వ్యాపారులు ఉచితంగా ఇవ్వడం, కాంట్రాక్టర్ తీసుకెళ్లడం ఆనవాయితీగా జరుగుతుండేది.
మహిళా నేత పోటీ
నంద్యాలకు చెందిన అధికార పార్టీ మహిళా నేత ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, రుద్రవరం తదితర ప్రాంతాల్లో చేపల చెరువులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నంద్యాలతోపాటు ప్యాపిలి, డోన్, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లోని చికెన్ సెంటర్ల నుంచి కోళ్ల వ్యర్థాలను సేకరిస్తున్నారు. తాజాగా ఆ మహిళా నేత కన్ను వ్యాపార కేంద్రమైన ప్రొద్దుటూరుపై పడింది. పట్టణంలో ఎక్కువ మొత్తంలో కోళ్ల వ్యర్థాలు వస్తున్నాయని తెలుసుకుని స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి వద్ద ఇటీవల పంచాయితీ నిర్వహించినట్లు సమాచారం. మీరు రెకమెండ్ చేస్తే రోజు ప్రొద్దుటూరు నుంచి నంద్యాలకు కోళ్లవ్యర్థాలను తీసుకెళుతానని ఆమె తన పరిధిలో పలుకుబడిని ఉపయోగించారు. ప్రజాప్రతినిధి ప్రముఖ చికెన్ సెంటర్ల నిర్వాహకుల ద్వారా విషయం తెలుసుకున్నారు. నంద్యాల నుంచి వచ్చి కోళ్ల వ్యర్థాలను తీసుకెళ్లడం కష్టమని, గంటగంటకు వ్యర్థాలు పేరుకుపోతే దుర్వాసనతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని వ్యాపారులు ప్రజాప్రతినిధికి చెప్పినట్లు తెలిసింది. వ్యాపారుల ఇష్ట ప్రకారమే తప్ప ఇందులో తమ ప్రమేయం ఏమి ఉండదని ప్రజాప్రతినిధి ఆమెకు తెలిపారు. జమ్మలమడుగు ప్రాంతం దగ్గర కావడంతో పాత కాంట్రాక్టర్ తీసుకెళ్లడానికి సులువుగా ఉంటుందని వ్యాపారులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. యథావిధిగా పాత కాంట్రాక్టర్ రోజు ఈ వ్యర్థాలను తీసుకెళుతున్నారు. కాగా సందట్లో సడేమియా అన్న చందంగా ప్రజాప్రతినిధికి అనధికారిక పీఏగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ ద్వారా నెలకు రూ.2.10 లక్షలు చెల్లించేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎక్కడా అధికారులు, పోలీసులు పట్టుకోకుండా మేనేజ్ చేస్తానని సదరు పీఏ హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ అంగీకరించారు. ఇందులో రూ.1.80లక్షలు పీఏకు, రూ.30వేలు పోలీసులకు ప్రతి నెల ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరింది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధి స్పందించి కోళ్ల వ్యర్థాలకు సంబంధించిన అంశాన్ని మున్సిపాలిటీకి అప్పగిస్తే ప్రతినెలా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
చికెన్ వ్యర్థాల తరలింపులోనూ కమీషన్ల కక్కుర్తి..
నెలకు రూ.2.10 లక్షలు చెల్లించి
తీసుకెళుతున్న కాంట్రాక్టర్