
చేవ లేక...చేతగాక..!
ప్రభుత్వ నిర్ణయంపై కార్పొరేటర్ల ఆగ్రహం
కడప కార్పొరేషన్ : అవిశ్వాసం పెట్టే చేవలేక...చేతగాక చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని మేయర్ సురేష్‌బాబుపై ప్రభుత్వం దొడ్డిదారిన అనర్హత వేటు వేసిందని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో స్థానిక సంస్థల్లో వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను గద్దెదించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడుతున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే...
మేయర్ ఎన్నిక సమయంలోనే ఇవన్నీ చూడాలి
మేయర్‌ను ఎన్నుకునే సమయంలోనే వారికి కాంట్రాక్టులు ఉన్నాయా? వారి కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు ఉన్నాయా? అన్న విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. మేయర్ ఎన్నిక పూర్తయి 2023లో వర్దిని కన్‌స్ట్రక్షన్ సంస్థ పుట్టింది. వర్దిని కన్‌స్ట్రక్షన్స్ రిజిస్ట్రేషన్‌ను అధికారులు రద్దు చేసి ఉండాలి. బీసీ నాయకులనే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వారిని పదవుల నుంచి తప్పిస్తోంది.
– బసవరాజు, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ప్రజాస్వామ్యం ఖూనీ
కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. కడప నగర పాలక సంస్థలో 50 స్థానాలకుగాను 49 మంది వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్‌ను ఏమి చేసుకోలేక ఎనిమిది మంది కార్పొరేటర్లను అన్ని విధాలుగా భయపెట్టి, మభ్యపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. మేయర్ కుమారుడు చేసిన కాంట్రాక్టు పనుల్లో అవినీతి జరిగిందని విజిలెన్స్ విచారణలో చెప్పలేదు.
– మల్లికార్జున, 10వ డివిజన్ కార్పొరేటర్

చేవ లేక...చేతగాక..!