17వ రోజుకు చేరిన ‘సీహెచ్‌ఓ’ల ఆందోళన
కడప రూరల్: వైఎస్సార్ కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌ఓ)ల సమ్మె కొనసాగుతోంది. ఏపీ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు కె.గిఫ్టీ షీలా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మె బుధవారం 17వ రోజుకు చేరింది. 90 శాతానికి పైగా సీహెచ్‌ఓలు దాదాపుగా ఉద్యోగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జీతం వస్తే గాని జీవనం గడవని పరిస్థితి. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు ఇంత వరకు ప్రభుత్వం ఒక నెల వేతనాలు మంజూరు చేయలేదు. కడప కలెక్టరేట్ వద్ద జరిగే కార్యక్రమాలకు చాలా మంది సీహెచ్‌ఓలు మండు టెండలను సైతం లెక్క చేయకుండా తమ పిల్లలతో వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తే తమ పిల్లలకు, కుటుంబానికి భద్రత ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శిబిరంలో ఉన్న చిన్నారులు, అటుగా వెళ్లేవారిని ఆకర్షిస్తున్నారు.
యువకుడి దారుణ హత్య
చక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం కోమటిపేటకు చెందిన కందుల చంటి (31) అనే యువకుడు దారుణ ఽహత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులతో పాటు పోలీసులు పేర్కొంటున్నారు. గ్రామస్తులు, చక్రాయపేట పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు చంటి కట్టెలు కొట్టడంతో పాటు ట్రాక్టర్ డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఇతను సురభి గ్రామం రెడ్డివారిపల్లె సమీపంలోని హరిజనవాడకు చెందిన ఓ వితంతుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ అంతకు ముందు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేది.
దీంతో సదరు వ్యక్తి చంటిపై కక్ష పెంచుకొని మరి కొందరి సహకారంతో కాపు కాచి దేవరగుట్టపల్లె సమీపంలో మంగళవారం రాత్రి రాళ్లతో దాడిచేసి ట్రాక్టరుతో తొక్కించి పరారయ్యాడు. చంటి గాయాలతో ఉన్న విషయం తెలుసుకొని కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి కడప రిమ్స్‌కు తరలించారు. అదే రోజు రాత్రి అతను మృతి చెందాడు. మృతుడి భార్య కందుల ఉమ తన భర్త హత్యకు దర్శనమ్మతో పాటు మరి కొందరు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. కాగా మృతుడికి భార్యతో పాటు నాలుగేళ్ల లోపు ఉన్న ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ పోషకుడు చనిపోవడంతో భార్యా పిల్లలు అనాథలయ్యారని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

కుటుంబ ‘సమ్మె’తంగా..