
ఏటీఎం చోరీకి యత్నం
ముద్దనూరు : స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న ఏ1 బ్యాంకు ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో దుండగులు ఏటీఎంలోకి చొరబడి ఏటీఎం బాక్స్‌ను పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లేదుకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఏటీఎంలో నగదు ఉంచే బాక్స్‌ను వారు తెరవలేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం బృందం వచ్చి వివరాలు సేకరించారు.
వివాహిత ఆత్మహత్య
రాజంపేట : రాజంపేట పట్టణ శివారులోని రామ్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత నరసమ్మ (45) పోలి చెరువు లో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తన భర్త మద్యానికి బానిసై నరసమ్మతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఇంటికి రాడనే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కోమటివానిచెరువులో వృద్ధురాలి మృతి
మదనపల్లె రూరల్ : మదనపల్లె పట్టణంలోని కోమటివానిచెరువులో వృద్ధురాలు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. పట్టణంలోని రెడ్డెప్పనాయుడు కాలనీకి చెందిన రత్నాకర్ ఆచారి భార్య డి.లక్ష్మీదేవమ్మ(80) గత కొంతకాలంగా మానసిక స్థితి బాగోలేక అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంటి నుంచి కనిపించకుండా పోయిన లక్ష్మీదేవమ్మ సాయంత్రం 5 గంటల సమయంలో కోమటివానిచెరువులో శవమై తేలింది.